Antarvedi: అంతర్వేది రూ. 2 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు

Antarvedi: అంతర్వేదిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. రూ. 2 కోట్లతో చేపట్టిన వివిధ ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ.

PRABHU, RAZOLE
Published on: 8 July 2026 4:00 PM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేది రూ. 2 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు

అంతర్వేది: డాక్టర్ .బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో రూ.2 కోట్ల పుష్కర నిధులతో చేపట్టనున్న పలు ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ నిధులతో అశ్వరూఢాంబిక (గుర్రాలక్క) అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, భక్తుల కోసం డార్మిటరీ భవనం నిర్మాణం, రథశాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యక్షేత్రమే కాకుండా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయమని అన్నారు. గోదావరి సముద్ర సంగమం కలిసే ఈ పుణ్యభూమికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అంతర్వేదిని రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పర్యాటక-ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

త్వరలోనే ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఒకేసారి 25 వేల మంది భక్తులు కూర్చునే సామర్థ్యం కలిగిన విశాలమైన కళ్యాణ మండపం, పశువుల సంరక్షణ కోసం శాశ్వత గోశాల నిర్మాణ పనులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

అంతర్వేది అభివృద్ధి వల్ల భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందడమే కాకుండా, పర్యాటక రంగం అభివృద్ధి చెంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story