Malikipuram: ప్రజల ఆరోగ్యమే లక్ష్యం.. మలికిపురం, సఖినేటిపల్లిలో త్వరలో కొత్త రైతు బజార్లు!
Malikipuram: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో రూ. 3 కోట్ల వ్యయంతో రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Malikipuram: ప్రజల ఆరోగ్యమే లక్ష్యం.. మలికిపురం, సఖినేటిపల్లిలో త్వరలో కొత్త రైతు బజార్లు!
Malikipuram: రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. రాజోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రైతు సంక్షేమం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంబేడ్కర్ కోనసీమ ప్రాంతంలోని మలికిపురం, సఖినేటిపల్లి మండలాలు తరచూ ముంపునకు గురికావడం వల్ల స్థానికంగా కూరగాయల సాగు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయల సరఫరాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
ప్రజలకు అవసరమైన కూరగాయలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషకాలు తగినంతగా లభించడం లేదని, ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన, తాజా కూరగాయలను సరసమైన ధరలకు అందించేందుకు రైతు బజార్ల ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు.
రైతు బజార్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా కూరగాయలను కొనుగోలు చేసి స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో మలికిపురంలో రూ.2 కోట్లతో, సఖినేటిపల్లిలో రూ.1 కోట్లతో రైతు బజార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.
సంబంధిత శాఖ మంత్రితో ప్రత్యేకంగా చర్చించి ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం లభించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




