P. Gannavaram: మానేపల్లి ఆలయాల పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన!
P. Gannavaram: కోనసీమ జిల్లా మానేపల్లిలో రూ.2.31 కోట్లతో మూడు ఆలయాల పునర్నిర్మాణ పనులకు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.
P. Gannavaram: మానేపల్లి ఆలయాల పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన!
P. Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, మానేపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సుమారు రూ.2.31 కోట్ల వ్యయంతో ఈ మూడు ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. శంకుస్థాపనకు ముందు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.
మానేపల్లి గ్రామంలో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ మూడు ఆలయాలు ఉండటం గ్రామ ప్రజలకు ఎంతో శుభదాయకమని, ఆ దేవతల ఆశీస్సులు గ్రామంతో పాటు మొత్తం పి. గన్నవరం నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పలు ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు ప్రతి గ్రామంలో దేవాలయాల అభివృద్ధి, నూతన ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




