P Gannavaram: బెల్లంపూడిలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా బెల్లంపూడిలో పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.

RAJU, P GANNAVARAM
Published on: 10 Aug 2026 5:54 PM IST
P Gannavaram
X

P Gannavaram: బెల్లంపూడిలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే!

పి. గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, బెల్లంపూడి గ్రామంలో నిర్వహించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, రైతులపై భారం మోపేలా ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను తీసుకువచ్చిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేసి, “రైతే రాజు” అనే నినాదంతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.

రైతుల కష్టపడి పనిచేయడం వల్లనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు భూమిపై ఉన్న హక్కులు, వివరాలు భద్రంగా ఉండేలా కూటమి ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియను పారదర్శకంగా చేపడుతోందని అన్నారు. రైతుకు సంబంధించిన భూమి వివరాలు పూర్తిగా, ఖచ్చితంగా ఉన్నప్పుడే, రైతు ఆమోదంతో పట్టాదార్ పాస్ పుస్తకం జారీ అవుతుందని తెలిపారు. రాజ్యముద్రలతో కూడిన ఈ పాస్ పుస్తకాలు రైతుల భూ హక్కులకు భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు తమ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, డ్రైనేజీ వ్యవస్థను మంజూరు చేయాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కోరారు. గ్రామంలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా గ్రామానికి చెందిన కూటమి నాయకులు రహదారులు, డ్రైనేజీలు, ఆలయాల అభివృద్ధితో పాటు గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు, నాయకులు కోరిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, ఆయా పనులకు సంబంధించిన ప్రతిపాదనలు మరియు వివరాలను తన కార్యాలయానికి అందించాలని సూచించారు.

ప్రతిపాదనలు అందిన వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని, ప్రజలు కోరిన అభివృద్ధి పనులకు వీలైనంత త్వరగా మంజూరు వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీ ఇచ్చారు. రైతు సంక్షేమంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story