P Gannavaram: ఉడుముడిలంక వైనతేయ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి ఎమ్మెల్యే!
P Gannavaram: ఉడుముడిలంక వద్ద వైనతేయ నదిపై నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ENC శ్రీ బాలు నాయక్ పరిశీలించారు.
P Gannavaram: ఉడుముడిలంక వైనతేయ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి ఎమ్మెల్యే!
పి. గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం ఉడుముడిలంక సమీపంలో వైనతేయ నదిపై నిర్మాణంలో ఉన్న నూతన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖ ENC శ్రీ బాలు నాయక్ తో కలిసి పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు.
ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు వీలైనంత త్వరగా బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఉడుముడిలంకకు సంబంధించి 49/2 నుంచి T02 రోడ్డు మార్గంలో వైనతేయ నదిపై నిర్మిస్తున్న ఈ హై లెవెల్ బ్రిడ్జి 320 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. ప్రధాన బ్రిడ్జిని 32.40 మీటర్ల స్పాన్‌తో 10 వెంట్లుగా నిర్మిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంతో పాటు మైనర్ బ్రిడ్జి, బాక్స్ కల్వర్టులు, అప్రోచ్ రోడ్లు, రక్షణ గోడలు, రోడ్డు భద్రతా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బూరుగులంక, జి. పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఉడుముడిలంక గ్రామాలకు చెందిన సుమారు 3,825 మంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా గోదావరి వరదల సమయంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగి, ఆయా గ్రామాల ప్రజలకు ఏడాది పొడవునా మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రస్తుతం మైనర్ బ్రిడ్జి సూపర్‌స్ట్రక్చర్ స్థాయి వరకు పనులు పూర్తయ్యాయి. 90 మీటర్ల ర్యాంప్‌లో 35 మీటర్ల మేర పనులు పూర్తికాగా, మిగిలిన 55 మీటర్ల పనులను కాల్వల మూసివేత సమయంలో చేపట్టనున్నారు. A1 వైపు మూడు బాక్స్ కల్వర్టుల నిర్మాణం సూపర్‌స్ట్రక్చర్ స్థాయి వరకు పూర్తయింది. అలాగే 245 మీటర్ల అప్రోచ్ రోడ్డులో 140 మీటర్ల మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు, అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సహకరించారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తున్నందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా పి. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తూ, నిధులు మరియు అనుమతుల విషయంలో చొరవ చూపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల చిరకాల అవసరంగా ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, అత్యవసర సేవలకు కూడా ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
వచ్చే మార్చి నెల నాటికి బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




