Mamidikuduru: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గిడ్డి

Mamidikuduru: మామిడికుదురులో ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం. రైతు ఖాతాల్లో రూ. 7,000 జమ చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.

RAJU, P GANNAVARAM
Published on: 21 Jun 2026 8:00 AM IST
Mamidikuduru
X

Mamidikuduru: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గిడ్డి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: మామిడికుదురు మండలం, నగరం మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు మొదటి విడత ఆర్థిక సాయం బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, సంవత్సరానికి మొత్తం రూ.20,000లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసే పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తొలి విడతగా ఈరోజు రూ.7,000లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

పి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన 23,796 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.16.20 కోట్లను జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి, సాగు ఖర్చులకు అండగా నిలిచే పథకం ఇదేనని ఆయన అభివర్ణించారు.

కష్టపడి పనిచేసి సమాజానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, “రైతు బాగుంటేనే మనం బాగుంటాం” అనే భావనతో ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులు అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు.

అనంతరం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన స్టాళ్లను సందర్శించిన ఎమ్మెల్యే యూరియా, డీఏపీ వంటి ఎరువుల పంపిణీ పారదర్శకంగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించిందని తెలిపారు. ఈ యాప్‌లో రైతుల వివరాలు నమోదు చేయబడతాయని, దాని ద్వారా ఎరువులు పక్కదారి పట్టకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

రైతుల సంక్షేమంపై నిజమైన నిబద్ధతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అలాగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,జనసైనికులు వివిధ శాఖల సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story