P Gannavaram: పి.గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి విస్తృత పర్యటన!

P Gannavaram: కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తుఫాను ప్రభావిత ప్రాంతాలు, పంట పొలాలను పరిశీలించి, బాధితులకు సహాయం భరోసా ఇచ్చారు.

RAJU, P GANNAVARAM
Published on: 29 Oct 2026 12:50 PM IST
P Gannavaram
X

P Gannavaram: పి.గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి విస్తృత పర్యటన!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలంలోని పలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పర్యటించారు.

ఈ సందర్భంగా పి.గన్నవరం బాలయోగి కాలనీతో పాటు పునరావాస కేంద్రాలను సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడి పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు.

అనంతరం పి.గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, ఇతర రోగులతో స్వయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందితో మాట్లాడి తుపాను పరిస్థితుల నేపథ్యంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మందులు, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలకు అందించే వైద్య సేవల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే తుపాను ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే , ఇళ్లు దెబ్బతిన్న బాధితులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయాన్ని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎటువంటి జాప్యం లేకుండా బాధిత ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.

అదేవిధంగా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పొలాలు, పంటలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

తుపాను పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు..

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM