Nidadavolu: నిడదవోలులో రూ.2 కోట్ల చీటీల మోసం మహిళ పరారీ

Nidadavolu: నిడదవోలులో చీటీల పేరుతో రూ.2 కోట్లు వసూలు చేసి మహిళ తిరుమల పరారీ. మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 22 July 2026 5:26 PM IST
Nidadavolu
X

Nidadavolu: నిడదవోలులో రూ.2 కోట్ల చీటీల మోసం మహిళ పరారీ

నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో భారీ చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా చీటీలు నిర్వహిస్తున్న తిరుమల అనే మహిళ సుమారు రూ.2 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కసారిగా పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నెలల తరబడి నమ్మకంతో చీటీల్లో డబ్బులు వేస్తూ వచ్చిన బాధితులు, చీటీ డబ్బులు చేతికి వచ్చే సమయానికి ఆమె కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కష్టపడి సంపాదించిన సొమ్ము, అత్యవసర అవసరాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం దాచుకున్న డబ్బు క్షణాల్లో చేజారిపోవడంతో అనేక కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

తిరుమలపై నమ్మకం ఉంచి లక్షల రూపాయలు చీటీల్లో పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు ఆమె ఆచూకీ తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిడదవోలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అసలు ఎంతమంది బాధితులు ఉన్నారు? మొత్తం ఎంత మేర నగదు వసూలు చేశారు? ఈ మోసం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన నిడదవోలులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చీటీల పేరుతో డబ్బులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, చట్టబద్ధమైన సంస్థలతోనే లావాదేవీలు జరపాలని పలువురు సూచిస్తున్నారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

Next Story