Nidadavolu: నిడదవోలులో అమృత్ 2.0 మంచినీటి ప్రాజెక్టు ప్రారంభం
Nidadavolu: నిడదవోలులో రూ.94.31 కోట్లతో అమృత్ 2.0 తాగునీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్. గోదావరి జలాలు అందిస్తామని హామీ.
Nidadavolu: నిడదవోలులో అమృత్ 2.0 మంచినీటి ప్రాజెక్టు ప్రారంభం
నిడదవోలు: నిడదవోలు పట్టణ ప్రజానీకానికి సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం నిడదవోలులో అమృత్ 2.0 పథకం కింద రూ. 94.31 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రొక్లెయిన్ ఎక్కి స్వయంగా మట్టి తొలగించి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. 2027 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి, 2028 జనవరి నాటికి నిడదవోలులోని ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా శుద్ధి చేసిన గోదావరి జలాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
రూ. 94.31 కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా రూ. 83.82 కోట్లతో చేపట్టనున్న అమృత్ 2.0 గ్రిడ్ లైన్ పనులు బుధవారం మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఇందులో భాగంగా విజ్జేశ్వరం సమీపంలోని ధవళేశ్వరం నుండి గ్రిడ్ లైన్ ద్వారా తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుదలతో పాటు, సంత వద్ద 10 MLD నీటి శుద్ధి కర్మాగారం మరియు అనుబంధ యూనిట్ల నిర్మాణం చేపడతామన్నారు.
సంత వద్ద 1000 కేఎల్, సెయింట్ ఆంబ్రోస్ స్కూల్ సమీపంలో 700 కేఎల్ సామర్థ్యం గల ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లతో కూడిన ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపడతామన్నారు. అదే విధంగా నిడదవోలు పట్టణవ్యాప్తంగా 90 కి.మీ. మేర పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.ఇప్పటికే 20 కి.మీ. పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చిన్నకాశీరేవు వద్ద నీటి సంపు నిర్మాణం చేపట్టనున్నామన్నారు.
ఇవే గాక రూ. 5.96 కోట్లతో ఎన్టీఆర్ నగర్ లేఅవుట్ ప్రాజెక్ట్ వద్ద స్థానిక వాసులకు ప్రత్యేక నీటి సరఫరా కార్యక్రమం చేపట్టామని మంత్రి దుర్గేష్ అన్నారు. రూ. 4.53 కోట్లతో మాలకోడు చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు ఆ పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
పునరుద్ధరణ పనుల్లో భాగంగా రెండు విడతల్లో చెరువు పూడికతీత, కొత్త కట్ట నిర్మాణం, రాతి కవచం ఏర్పాటుతో ఐ అండ్ డి నిర్మాణాల ద్వారా మురుగునీటి మళ్లింపు, బహిరంగ కాలువ నిర్మాణం, 858 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తుతో రక్షణ కంచె, వాకింగ్ ట్రాక్ మరియు చెరువు మధ్యలో ఆకర్షణీయమైన ఫౌంటెన్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.
*గత ప్రభుత్వం వైఫల్యం – కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి*
ఈ సందర్భంగా గత ప్రభుత్వ తీరుపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.గోదావరి పక్కనే ఉన్నప్పటికీ ప్రజల దాహార్తిని తీర్చడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.2014-19లో తెదేపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జల్ జీవన్ మిషన్, అమృత్ నిధులను 2019-24 మధ్య పక్కదారి పట్టించారని ఆరోపించారు.
రూ. 73 కోట్లు ఖర్చు చేశామని ప్రచారాలు చేసుకున్నా, కనీసం ఒక్క పైప్‌లైన్ కూడా వేయకపోవడంతో నిధులు సమకూర్చిన 'ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్' తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఏషియన్ బ్యాంక్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించారని గుర్తుచేశారు. గతేడాది గ్రామీణ ప్రాంతాలకు నీరు అందించే అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెరవలిలో ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు.
*పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదు..అధికారులకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక*
తన ప్రాతినిధ్యంలో పట్టణ అభివృద్ధికి రూ. 196 కోట్లు, శాస్కి పథకం కింద గ్రామీణ రోడ్ల కోసం రూ. 28 కోట్లు తీసుకువచ్చానని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిధుల సమీకరణ తన బాధ్యత అని, పనులను శరవేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు.పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
*నిడదవోలు మున్సిపాలిటీకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవార్డుపై మంత్రి దుర్గేష్ ప్రశంసలు*
రాష్ట్రవ్యాప్తంగా 50,000 జనాభా ఉన్న పురపాలక సంఘాల విభాగంలో నిడదవోలు పట్టణంలో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు 'స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్' ద్వారా సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రథమ బహుమతి రావడం పట్ల మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. వేదికపై మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని,సిబ్బందిని అభినందిస్తూ ఆ అవార్డును ప్రజలకు ప్రదర్శించారు.
తాగునీరు అందించే కార్యక్రమాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి స్థానిక నాయకులు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిడదవోలు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి కందుల దుర్గేష్‌ను స్థానిక ప్రజలు, నాయకులు ఘనంగా సన్మానించారు.




