Rajamahendravaram: గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు కీలకం!

Rajamahendravaram: రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలు–2027పై జరిగిన వర్క్‌షాప్‌లో పుష్కరాల నిర్వహణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు కీలకమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 16 Nov 2026 9:19 PM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు కీలకం!

Rajamahendravaram: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో సోమవారం రాజమహేంద్రవరంలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణపై నిర్వహించిన వర్క్‌షాప్‌కు వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, కలెక్టర్ కీర్తి చేకూరి అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027లో జరిగే గోదావరి పుష్కరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమాలు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, విశ్వవిద్యాలయం, వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఘాట్ల వద్ద పరిశుభ్రత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఆరోగ్య భద్రత, రవాణా నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చురుకుగా పాల్గొని భక్తులకు అవసరమైన సమాచారం అందించడం, మార్గనిర్దేశం చేయడం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి సేవలు అందించాలని కోరారు. వాలంటీర్లు కేవలం సేవకులుగా కాకుండా గోదావరి జిల్లాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యానికి ప్రతినిధులుగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

పుష్కరాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ గోదావరి నది మన ప్రాంతానికి జీవనాధారమే కాకుండా, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. గోదావరి పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు విశ్వవిద్యాలయం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, విద్యార్థి వాలంటీర్లు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు, భక్తులకు సహాయ సహకారాలు అందించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. విద్య అనేది తరగతి గదులకే పరిమితం కాకుండా సమాజ సేవ ద్వారా ప్రతిఫలించాలని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ వాలంటీర్ల సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

జాయింట్ కలెక్టర్ శుభం నోక్వాల్ మాట్లాడుతూ పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం నగరంలోని గోదావరి ఘాట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాల వద్ద ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు ఎంతో అవసరమవుతాయని అన్నారు. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు వాలంటీర్లు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి భక్తులకు సహాయపడాలని సూచించారు.

జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ వారికి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.ఈ సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇన్నోవేషన్స్ – గోదావరి పుష్కరాలు పేరుతో రూపొందించిన కార్యక్రమ బ్రోచర్లను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథి కలెక్టర్ కీర్తి చేకూరి, ఇతర అతిథులను విశ్వవిద్యాలయ అధికారులు ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మ, డిప్యూటీ కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మార్వో సిహెచ్. దివ్యభారతి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె.వి. స్వామి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM