Ainavilli: అయినవిల్లిలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిడ్డి
Ainavilli: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రాజముద్రతోనే పాస్ పుస్తకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు.
Ainavilli: అయినవిల్లిలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిడ్డి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: అయినవిల్లి మండలం అయినవల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద అయినవిల్లి మండలంలోని కొండుకుదురు, చింతనలంక, కె. జగన్నాథపురం, క్రాప గ్రామాల్లో నిర్వహించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిందని విమర్శించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను తీసుకొచ్చి రైతులపై భారాన్ని మోపిందని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేసి, “రైతే రాజు” అనే భావనతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు.
రైతుల కృషి వల్లనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందిస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాలకు ప్రత్యేకత ఉందన్నారు. రైతుకు సంబంధించిన వివరాలు పూర్తిగా, ఖచ్చితంగా ఉన్నప్పుడే, రైతు ఆమోదంతో పట్టాదార్ పాస్ పుస్తకం జారీ అవుతుందని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో నాయకుల ఫోటోలకు ప్రాధాన్యత ఇస్తూ పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేశారని, అయితే కూటమి ప్రభుత్వం ఎలాంటి నాయకుల ఫోటోలు లేకుండా కేవలం రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేస్తోందని తెలిపారు. ఇది రైతుల పట్ల ప్రభుత్వం నిబద్ధత, పారదర్శకతకు నిదర్శనమని అన్నారు.
అదేవిధంగా, ఇటీవల అంబాజీపేట మండలం మాచవరం గ్రామం పండువారిపేటలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, అధికారుల పనితీరును సమీక్షించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రజలు తమ సమస్యలతో అధికారుల వద్దకు వచ్చినప్పుడు వాటిని అధికారులు సరైన పద్ధతిలో పరిష్కరిస్తున్నారా? ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు? అనే అంశాలను తాను ప్రతి నెలా ఒకరోజు తప్పనిసరిగా స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు.
ప్రతి ప్రభుత్వ అధికారి ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించి వారికి మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమం అనంతరం ఒంటరి మహిళకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




