Rajahmundry: పుష్కరాల తర్వాతా ఉపయోగపడేలా శాశ్వత వసతులు: కమిషనర్ రాహుల్ మీనా
Rajahmundry: గోదావరి పుష్కరాల కోసం తాత్కాలికంగా కాకుండా భవిష్యత్తుకు ఉపయోగపడేలా శాశ్వత వసతులు కల్పించాలని రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు.
Rajahmundry: పుష్కరాల తర్వాతా ఉపయోగపడేలా శాశ్వత వసతులు: కమిషనర్ రాహుల్ మీనా
రాజమండ్రి: రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని కాతేరు ప్రాంతంలో భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చేందుకు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు.
శుక్రవారం జిల్లా అదనపు ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్‌తో కలిసి కాతేరు గోదావరి తీర ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి పుష్కర ఏర్పాట్లకు అనువైన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా VIPల కోసం తాత్కాలిక వసతి, పార్కింగ్ సదుపాయాలు, VIP ఘాట్, తాత్కాలిక ఘాట్లు, భక్తుల ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. భక్తులు, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ముందుగానే గుర్తించి అవసరమైన విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కచ్చా రహదారిని అభివృద్ధి చేసి, ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా రహదారి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
కాతేరు గోదావరి తీరంలో VIP ఘాట్‌తో పాటు మరో తాత్కాలిక ఘాట్ నిర్మాణానికి అవసరమైన అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. స్థలాలను పరిశీలించి ల్యాండ్ మార్కింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పార్కింగ్, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు.
పుష్కరాల కోసం తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమం ముగిసిన తర్వాత వాటిని తొలగించడం కాకుండా, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఘాట్ల నిర్మాణం, రంగులు వేయడం వంటి పనులతో మాత్రమే పరిమితం కాకుండా నది స్వచ్ఛత, భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో అదనపు ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, పుష్కర డిప్యూటీ కలెక్టర్ మహేష్, సీఐ (ట్రాఫిక్) నబీతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ, ఆర్‌ఎంసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.




