Rajahmundry: పీజీఆర్ఎస్ అర్జీలపై రాజమండ్రి కమిషనర్ రాహుల్ కీలక ఆదేశాలు
Rajahmundry: సంస్థ పరిధిలో పీజీఆర్ఎస్ అర్జీలను అత్యంత నాణ్యతతో, అర్జీదారులు సంతృప్తి చెందేలా తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు
Rajahmundry: పీజీఆర్ఎస్ అర్జీలపై రాజమండ్రి కమిషనర్ రాహుల్ కీలక ఆదేశాలు
రాజమండ్రి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) లో స్వీకరించిన అర్జీలను అత్యంత నాణ్యతతో, పున: పరిశీలనకు తావు లేకుండా పరిష్కరించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు.
నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 24 అర్జీలు రాగా వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 6, రెవెన్యూకి సంబంధించి 3, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 10, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 4, అకౌంట్స్ విభాగానికి సంబంధించి ఒకటి ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతీ అర్జీ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులకు సూచించారు. కేవలం సమస్యలను పరిష్కరించడమే ముఖ్యం కాదని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ పోర్టల్ లో నమోదైన ఫిర్యాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్ లో ఉండకూడదని, నూరుశాతం పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం అధికారులు స్వయంగా అర్జీదారులతో మాట్లాడి, సమస్య పరిష్కారంపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
అలాగే ప్రజలు 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా.. లేదా మీకోసం పోర్టల్ లో అర్జీలను ఆన్ లైన్ లో సమర్పించవచ్చని తెలియజేశారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, రెవిన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.




