Pithapuram: వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసు దోపిడీ ముగ్గురు అరెస్ట్
Pithapuram: పిఠాపురం రూరల్ విరవలో వృద్ధురాలి ఇంట్లో చోరీ కేసును ఛేదించి ముగ్గురు నిందితుల అరెస్ట్. రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసు స్వాధీనం.
Pithapuram: వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసు దోపిడీ ముగ్గురు అరెస్ట్
Pithapuram: పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విరవ గ్రామంలో వృద్ధురాలి ఇంట్లో చొరబడి బంగారు గొలుసు దోపిడీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు రూ.2.50 లక్షల విలువైన 2½ కాసుల బంగారు గొలుసును రికవరీ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 27న రాత్రి వృద్ధురాలు తోట నాగమణి (60) ఇంట్లో నిద్రిస్తుండగా, నిందితులు ఆమె నోటిని టవల్‌తో అదిమిపట్టి మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లారు. దీనిపై సెప్టెంబర్ 28న పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. సెప్టెంబర్ 29న విరవ గ్రామంలోని జట్లమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు:
A1 తోట రాంబాబు (40), ఆటో డ్రైవర్, వీరవ గ్రామం;
A2 దాసరి ప్రసాద్ (39), లారీ డ్రైవర్, వీరవ గ్రామం;
A3 రంపం విజయకుమార్ (36), మేస్త్రీ, పిఠాపురం.
నేరానికి ఉపయోగించిన పల్సర్ మోటార్‌సైకిల్, OPPO A16 ఆండ్రాయిడ్ మొబైల్, మోటరోలా కీప్యాడ్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, IPS ఆదేశాల మేరకు, అడ్మిన్ ASP మహంతి కిషోర్ కుమార్ సూచనలతో పిఠాపురం సీఐ జి.వి.వి. సత్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీఐ, పిఠాపురం రూరల్ ఎస్‌ఐ ఎస్.కె. జాన్ భాషా, క్లైమ్ టీం సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.




