Rampachodavaram: సీఎస్ఆర్ నిధులతో జిల్లా ప్రగతి: కలెక్టర్ దినేష్ కుమార్!
Rampachodavaram: పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి సీఎస్ఆర్, నీతి ఆయోగ్ నిధులతో చేపట్టే పనులకు ప్రాధాన్యతా క్రమంలో డీపీఆర్‌లు సిద్ధం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు.
Rampachodavaram: సీఎస్ఆర్ నిధులతో జిల్లా ప్రగతి: కలెక్టర్ దినేష్ కుమార్!
రంపచోడవరం: పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రాధాన్యతా క్రమంలో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (DPRలు), అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం రంపచోడవరం కలెక్టరేట్‌లోని ఐటీడీఏ సమావేశ మందిరంలో సీఎస్ఆర్ కార్యకలాపాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ, ప్రాజెక్టు నివేదికల రూపకల్పనపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కమ్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, ఆశయ బ్లాక్ ఫెలోస్, CVAPU బృందం సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HUDCO), డెక్కన్ కెమికల్స్, ఏపీ ట్రాన్స్‌కో, హెచ్‌డీఎఫ్‌సీ ఫౌండేషన్, కోటక్ ఫౌండేషన్, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ తదితర సంస్థల సీఎస్ఆర్ నిధులతో చేపట్టగల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా ఆరోగ్యం, పోషకాహారం, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి, క్రీడా సముదాయాల ఏర్పాటు, ఉపాధి అవకాశాల కల్పన, విద్య తదితర రంగాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
నీతి ఆయోగ్ ద్వారా గంగవరం మండలానికి రూ.1 కోటి, మారేడుమిల్లి మండలానికి రూ.21.5 కోట్ల అవార్డు నిధుల కోసం అవసరమైన డీపీఆర్‌లను వారంలోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే నీతి ఆయోగ్ సహకారంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, థీమ్ పార్క్ లేదా ఎక్స్‌పీరియన్స్ పార్క్ అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. జీవనోపాధి, ఆరోగ్యం, పోషకాహారం, విద్యా రంగాల్లో రూ.2 కోట్ల వ్యయంతో రెండు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
జిల్లాలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, జాఫ్రా, రబ్బరు పరిశ్రమలపై సమగ్ర అధ్యయనం నిర్వహించి వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్, ఉపాధి అవకాశాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో నిర్వహిస్తున్న DANNEX (Dantewada Next) వస్త్ర పరిశ్రమను అధ్యయనం చేసి, పోలవరం జిల్లాలో కూడా ఇటువంటి పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
అదేవిధంగా 'గవర్నెన్స్ ఆన్ వీల్స్', 'మా ఊరి మైదానం' వంటి కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కేటాయించిన అంశాలపై అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ, నిర్దేశించిన గడువులోగా నాణ్యమైన డీపీఆర్‌లు సమర్పించాలని స్పష్టం చేశారు.
సమావేశంలో వై. రామవరం ఆశయ బ్లాక్ ఫెలో కె. లవన్ రెడ్డి, గంగవరం ఆశయ బ్లాక్ ఫెలో ఎల్. హేమ మాధురి, మారేడుమిల్లి ఆశయ బ్లాక్ ఫెలో ఆర్. కృష్ణ, CVAP యూనిట్‌కు చెందిన మధుర దేవి తదితరులు పాల్గొన్నారు.




