Rampachodavaram: జిల్లాలో 186 గ్రామ పంచాయతీలకు రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణ!
Rampachodavaram: పోలవరం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో పూర్తయిందని, బుధవారం స్క్రూటినీ మరియు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని డీపీఓ జి. భాస్కర్ తెలిపారు.
Rampachodavaram: జిల్లాలో 186 గ్రామ పంచాయతీలకు రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణ!
రంపచోడవరం: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు, ఎన్నికల షెడ్యూల్ మేరకు పోలవరం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో పూర్తయిందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి జి. భాస్కర్ తెలిపారు.
బుధవారం (నవంబర్ 18) ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన (స్క్రూటినీ) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని వివరించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రెండవ విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. రెండవ విడతలో గుర్తేడు, వై.రామవరం, చింతూరు, మారేడుమిల్లి, కూనవరం, వి.ఆర్.పురం, ఏటపాక మండలాల పరిధిలోని 95 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ దిశానిర్దేశంలో పోలవరం జిల్లాలోని 12 మండలాల పరిధిలో మొత్తం 186 గ్రామ పంచాయతీలు, 1,734 వార్డు స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు జి. భాస్కర్ తెలిపారు. మొదటి విడతలో అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రాజవొమ్మంగి, రంపచోడవరం మండలాల్లోని 91 గ్రామ పంచాయతీలకు నవంబర్ 26న, రెండవ విడతలోని 95 గ్రామ పంచాయతీలకు నవంబర్ 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 2,78,545 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని తెలిపారు.
మొదటి విడతలో నవంబర్ 26న, రెండవ విడతలో నవంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు, ప్రజలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి జి. భాస్కర్ కోరారు.




