Polavaram: పోలవరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Polavaram: పోలవరం జిల్లాలో నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. 368 పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్‌కాస్టింగ్, 1,100 మంది పోలీసులతో భారీ బందోబస్తు.

Prasanna, Rampachodavaram
Published on: 4 Nov 2026 3:55 PM IST
Polavaram
X

Polavaram: పోలవరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

పోలవరం: పోలవరం జిల్లాలో నవంబర్ 5వ తేదీన నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ఐటీడీఏలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కె. చక్రవర్తితో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సమయాలు, భద్రతా చర్యల వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు జిల్లాలో మొత్తం 368 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, మారుమూల ప్రాంతాల్లోని 44 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు, మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమయాల వివరాలను ఇప్పటికే ప్రజలకు తెలియజేయడంతో పాటు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచినట్లు తెలిపారు.

ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి మండలంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి పకడ్బందీగా శిక్షణ అందించామని, ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తి చేసినట్లు వివరించారు. ఎన్నికల విధుల్లో సుమారు 2,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. బుధవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో బయలుదేరిన సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తారని, గురువారం ఉదయం 7 గంటలకల్లా ఓటర్లు ఓటు వేసేందుకు అన్ని కేంద్రాలు సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో నిఘా.. మొత్తం ప్రక్రియ రికార్డింగ్

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా జిల్లాలోని మొత్తం 368 పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ లేదా వీడియో రికార్డింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో రికార్డు చేసే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన దృశ్యాలను భద్రపరచనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇప్పటికే పలు ముందస్తు చర్యలు చేపట్టామని, నిఘా సమాచారం ఆధారంగా సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉన్న వ్యక్తులను బైండోవర్ చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ఏరియా డామినేషన్ నిర్వహించినట్లు వివరించారు.

ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తమకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ల ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఓటరు గుర్తింపు కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా తమ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. ఐటిడిఎ సమావేశ మందిరంలో వెబ్ కాస్టింగ్ సెంట్రాలైజ్డ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియలో ప్రజలు, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ వర్గాల భాగస్వాములు, సంబంధిత అధికారులు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తామని, ఎవరైనా గొడవలకు పాల్పడినా, ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 5వ తేదీ గురువారం పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, బ్యాంకులకు స్థానిక సెలవు (Local Holiday) ప్రకటించినట్లు కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించడంతో పాటు అర్హులైన ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడమే ఈ సెలవు ప్రకటన ఉద్దేశమని పేర్కొన్నారు.

1,100 మంది పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు

జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున సుమారు 1,100 మంది పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఏరియా డామినేషన్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, రూట్ మొబైల్స్, స్టాటిక్ పార్టీలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (QRT), స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించామని, సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వినియోగించే అక్రమ మద్యం, నగదు తదితర అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక పండుగ వంటివని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. ఎన్నికల అక్రమాలు, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలపై ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే పోలీసు శాఖకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచి, ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడినా, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు, అధికారుల సమష్టి సహకారంతో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తిచేస్తామని కలెక్టర్, ఎస్పీ తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram