B.Savaram: వికలాంగుడి ఇంటికి పునరుద్ధరించిన విద్యుత్ సరఫరా!

B.Savaram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా బి.సావరం గ్రామంలో రెండు చేతులు లేని వికలాంగుడి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ.

PRABHU, RAZOLE
Published on: 4 Nov 2026 9:28 AM IST
B.Savaram
X

B.Savaram: వికలాంగుడి ఇంటికి పునరుద్ధరించిన విద్యుత్ సరఫరా!

B.Savaram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లోని బి.సావరం గ్రామంలో రెండు చేతులు లేని నిరుపేద వికలాంగుడి ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం సాయంత్రం విద్యుత్ సిబ్బంది బాధితుడి ఇంటికి చేరుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

డబ్బులు చెల్లించలేదనే కారణంతో తన ఇంటికి విద్యుత్ లైన్ నిలిపివేశారంటూ బాధితుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హెచ్ఎంటీవీ వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించారు.

ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. ఫోన్ చేసిన వెంటనే స్పందించి విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు, స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు, విద్యుత్ శాఖ సిబ్బందికి, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన హెచ్ఎంటీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉండగా, విద్యుత్ శాఖ సిబ్బంది పేర్లు చెప్పుకుంటూ కొందరు మధ్యవర్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించారు. తమ శాఖ సిబ్బంది ఎక్కడా, ఎవరి వద్దా అక్రమంగా డబ్బులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా విద్యుత్ శాఖ అధికారుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా కథనానికి అధికారుల స్పందనతో ఓ వికలాంగుడి ఇంట్లో మళ్లీ వెలుగులు నిండాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE