Rajahmundry: బ్రెయిన్‌ డెడ్‌ అయిన అడపా సుధీర్ అవయవదానం

Rajahmundry: రాజమండ్రిలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన అడపా సుధీర్ అవయవదానం చేసి నలుగురి ప్రాణాలు నిలపడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 9 Oct 2026 6:32 PM IST
Rajahmundry
X

Rajahmundry: బ్రెయిన్‌ డెడ్‌ అయిన అడపా సుధీర్ అవయవదానం

రాజమండ్రి: అనుకోని పరిస్థితుల్లో బ్రెయిన్‌ డెడ్‌కు గురైన కొవ్వూరుకు చెందిన అడపా సుధీర్‌ అవయవదానంతో నలుగురికి పునర్జన్మ ప్రసాదించారు. రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి చేరుకున్న రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సుధీర్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుధీర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి విషాద సమయంలో అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యుల సేవా దృక్పథాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. అవయవదానంపై సమాజంలో ఇంకా అనేక అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జీవించి ఉన్న సమయంలోనే అవయవదానం చేయాలనే సంకల్పం కలిగి ఉన్న సుధీర్‌ నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు గౌరవించి అమలు చేయడం అభినందనీయమన్నారు.

మరణానంతరం కూడా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అవయవదానం ఒక గొప్ప అవకాశమని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సుధీర్‌ అవయవాల ద్వారా ఒకరికి కాలేయం, మరొకరికి ఊపిరితిత్తులు అందించడంతో పాటు, ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి పంపించినట్లు, ఒక కిడ్నీని స్థానికంగా అవసరమైన వ్యక్తికి అందించగా, మరో కిడ్నీని విశాఖపట్నానికి తరలిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాలకు అవయవాలను వేగంగా తరలించేందుకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి సహకరించిన పోలీసు శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం అందించడంతో పాటు, ఈ క్లిష్ట సమయంలో కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా బొల్లినేని ఆసుపత్రి యాజమాన్యం కూడా సహకారం అందించడం అభినందనీయమన్నారు. వైద్యులు, ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సుధీర్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన దానం చేసిన అవయవాల ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపుతూ జీవించే ఉంటారన్నారు.

ఆయన సేవాస్ఫూర్తి మరింతమందిలో అవయవదానంపై అవగాహన కలిగించాలని ఆకాంక్షించారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, మరణానంతరం కూడా ఇతరులకు జీవితాన్ని అందించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సుధీర్‌ కుటుంబ సభ్యులకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ మహత్తర సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావడం తనకు గొప్ప అవకాశంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY