Rajahmundry: రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 15 యాత్రి సువిధా దివస్
Rajahmundry: రాజమహేంద్రవరం విమానాశ్రయంలో జూన్ 15న “యాత్రి సువిధా దివస్ – 2026” వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
Rajahmundry: రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 15 యాత్రి సువిధా దివస్
Rajahmundry: ప్రభుత్వం, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) చేపడుతున్న విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి, విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, సమాజ అభివృద్ధిలో విమానాశ్రయాల పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా జూన్ 15న “యాత్రి సువిధా దివస్ – 2026” నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం విమానాశ్రయ డైరెక్టర్ కె. ప్రీతి తెలిపారు.
ఈ సందర్భంగా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు తిలకం దిద్ది గులాబీ పుష్పాలతో స్వాగతం పలకడం, టెర్మినల్ భవనం వద్ద అన్ని భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో కలిసి “వందే మాతరం” గానం చేయడం, హౌస్ కీపింగ్ సిబ్బందిని సత్కరించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
అలాగే విమానాశ్రయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ప్రయాణికులకు మొక్కల పంపిణీ, ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం (బీపీ, షుగర్, బీఎంఐ, ఈసీజీ, సీబీపీ పరీక్షలు), ప్రభుత్వ ఆసుపత్రి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెర్మినల్ భవనంలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు, చిన్నారుల కోసం చిత్రలేఖనం పోటీలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
విమానయాన రంగంలో సేవలందిస్తున్న మహిళా ఉద్యోగులను సత్కరించడం, రాత్రి వేళల్లో టెర్మినల్ భవనాన్ని ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించడం ద్వారా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రయాణికులు, ప్రజలు, విమానాశ్రయ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని రాజమహేంద్రవరం విమానాశ్రయ డైరెక్టర్ కె. ప్రీతి కోరారు.




