Rajahmundry: గోదావరి పుష్కరాల వేళ ఆక్రమణలపై కమిషనర్ కఠిన ఆదేశాలు
Rajahmundry: గోదావరి పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి ఘాట్లు, డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలను వారం రోజుల్లో తొలగించాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు.
Rajahmundry: గోదావరి పుష్కరాల వేళ ఆక్రమణలపై కమిషనర్ కఠిన ఆదేశాలు
రాజమండ్రి: రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల భద్రతకు విఘాతం కలిగించే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను పూర్తిగా నిర్మూలించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం ఉదయం నగరపాలక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి.. దోబీ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమీ ఘాట్ సహా పలు ప్రాంతాలను సందర్శించారు.
వారం రోజుల్లోగా దోబీ ఘాట్ నుంచి సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్ సహా మహాకాళేశ్వర టెంపుల్ వరకు ఉన్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి సురక్షితమైన రాకపోకలు కల్పించడంతో పాటు క్రౌడ్ మేనేజ్‌మెంట్ కు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
భక్తులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించటం, రవాణా, సౌకర్యార్థం ఘాట్ల వెంబడి ఉన్న అనధికారిక కట్టడాలు, దుకాణాలను పూర్తిగా తొలగించాలన్నారు. పుష్కరాల సమయంలో నదీ స్నానాలు చేసే భక్తుల భద్రత అత్యంత ముఖ్యమని.. ఇందులో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాలను రక్షించడం, తీరం వెంబడి ఉన్న ఆటంకాలను తొలగించడం అత్యవసరమని పేర్కొన్నారు.
అలాగే నగరంలో భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు, ఫుట్ పాత్ లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు. ప్రధాన డ్రైనేజీ నెట్‌వర్క్, మైనర్ కాలువలపై వెలిసిన కమర్షియల్ షాపులు, ఆక్రమణలను గుర్తించి తక్షణమే తొలగించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
రహదారులపై ట్రాఫిక్ అంతరాయాలు తగ్గించటం, డ్రెయిన్ లలో నీటి ప్రవాహాన్ని మెరుగుపరచటం, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించటం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన వెంట స్పెషల్ ఆఫీసర్ మహేష్, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఈఈ మాధవి, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.




