Rajahmundry: పీసీసీ ఐదు డిమాండ్లు – సిఈసి రాజీనామాకు కాంగ్రెస్ పట్టు!
Rajahmundry: రాజమండ్రిలో కాంగ్రెస్ 'ఓటు బచావో.. దేశ్ బచావో' ప్రెస్ మీట్. సిఈసి రాజీనామా, ఎస్ఐఆర్ నిలిపివేత సహా 5 డిమాండ్లతో నవంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిరసన.
Rajahmundry: పీసీసీ ఐదు డిమాండ్లు – సిఈసి రాజీనామాకు కాంగ్రెస్ పట్టు!
రాజమండ్రి: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ ఉద్యమాన్ని చేపట్టిందని పీసీసీ ఐదు జిల్లాల అబ్జర్వర్ కిరణ్ తెలిపారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ వద్దనున్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా పార్లమెంటు కోఆర్డినేటర్ టి.కె. విశ్వేశ్వర్ రెడ్డి, నగర జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తుఫాను, భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ఐదు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను ఉద్యమానికి సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, స్వతంత్రతను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఐదు ప్రధాన డిమాండ్లను ముందుకు తెచ్చిందన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరపాలని, ఓటర్ల పేర్ల తొలగింపులు, కొత్త పేర్ల చేర్పులకు సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని రాజకీయ పార్టీలకు అందించాలని కోరారు. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక విధానాన్ని సమీక్షించి, ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర సీనియర్ నాయకులు పార్లమెంట్‌లోనూ, ఢిల్లీలోనూ ఓటు హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తున్నారని కిరణ్ తెలిపారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలను సమీకరించేందుకు ఐదు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ అనంతరం ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ ఉద్యమాన్ని రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్, పంచాయతీ, వార్డు స్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించేందుకు ‘ఓటు రక్షక్’ కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లను రంగంలోకి దించుతామని చెప్పారు. ఓటర్ల పేర్ల తొలగింపులు, కొత్త పేర్ల చేర్పుల్లో గుర్తించిన వ్యత్యాసాలను నమోదు చేసి పీసీసీ అధ్యక్షుడికి నివేదిస్తామని, బాధిత ఓటర్లకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత సాధించి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సింధియా రాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద, అర్బన్ బీసీ సెల్ చైర్మన్ తాడి సూరిబాబు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




