Rajahmundry: రూ.7.60 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన!
Rajahmundry: రాజమహేంద్రవరం నగరంలో రూ.7.60 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) శంకుస్థాపన చేశారు.
Rajahmundry: రూ.7.60 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన!
Rajahmundry: నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలో ఎటు చూసినా ప్రజలు కోరుకుంటున్న, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా బుధవారం మొత్తం రూ.7.60 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు.
కోటి లింగాల ఘాట్ సమీపంలోని 10 ఎంఎల్టి ప్లాంట్ వద్ద రూ.1.30 కోట్లతో ఎస్కలేటర్ ఏర్పాటు, రూ.4 కోట్లతో యుటిలిటీ వాటర్ సప్లై ఏర్పాట్లకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే వాసు వివరించారు. అలాగే పుష్కరాల సందర్భంగా అవసరమైన విద్యుత్ పనుల్లో భాగంగా క్వారీ సెంటర్ వద్ద రూ.27 లక్షలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
క్వారీ జంక్షన్ నుంచి శానిటోరియం, ఎయిర్పోర్ట్ రోడ్డు పరిధిలోనూ, జె ఎన్ రోడ్డు రామాలయం జంక్షన్ వద్ద కూడా పుష్కరాల విద్యుత్ పనులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రామాలయం జంక్షన్ వద్ద ఈ పనులకు రూ.1.50 కోట్లతో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా నగరంలోని ఒకటో వార్డు బాబానగర్లో గత 15 సంవత్సరాలుగా రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీకి చెందిన వార్డు ఇన్చార్జి నివసించే అపార్ట్మెంట్ ఉన్న రోడ్డులో కూడా రోడ్లు, డ్రైన్లు నిర్మించలేకపోయారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాబానగర్లో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
రేపటి నుంచే పనులు ప్రారంభం.. రెండు, మూడు నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులన్నింటినీ రేపటి నుంచే ప్రారంభించి, వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలో ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉందో గుర్తిస్తూ, ఆయా ప్రాంతాల్లో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా చేపడుతున్నామని వివరించారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచిస్తున్నామని తెలిపారు. కూటమి నాయకులు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పనుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
నగర ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ, రాజమహేంద్రవరం నగరంలో ఎటు చూసినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇవన్నీ ప్రజలు కోరుకుంటున్న, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలేనని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన పేర్కొన్నారు. ఆయా కార్యకమాల్లో కూటమి నాయకులు, ఆయా డివిజన్ల ఇంచార్జ్ లు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




