Rajahmundry: రాజమండ్రిలో ముంపు సమస్యకు చెక్.. రూ.2 కోట్లతో అదనపు వెంట్ నిర్మాణం!
Rajahmundry: రాజమండ్రిలో ముంపు సమస్య పరిష్కారానికి నల్లా ఛానల్ వద్ద రూ.2 కోట్లతో అదనపు వెంట్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
Rajahmundry: రాజమండ్రిలో ముంపు సమస్యకు చెక్.. రూ.2 కోట్లతో అదనపు వెంట్ నిర్మాణం!
Rajahmundry: నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షాల సమయంలో తలెత్తుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో కీలక అడుగు పడింది. నల్లా ఛానల్ వద్ద రూ.2 కోట్ల వ్యయంతో అదనపు వెంట్ నిర్మాణానికి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ అదనపు వెంట్ నిర్మాణంతో వర్షాకాలంలో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో పేరుకుపోయే వర్షపు నీటిని వేగంగా గోదావరిలోకి మళ్లించేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. అదే సమయంలో గోదావరి నదీ జలాలను కలుషితం కాకుండా కాపాడేందుకు మురుగునీటిని శుద్ధి చేసి మాత్రమే తరలించేలా సమగ్ర ప్రణాళికతో పనులు చేపడుతున్నామని వివరించారు.
నగరం భౌగోళికంగా సాసర్ ఆకారంలో, లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల భారీ వర్షాలు కురిసినప్పుడు అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. వర్షపు నీటితో పాటు రోజువారీగా వెలువడే వాడుకపు నీరు కూడా సకాలంలో బయటకు వెళ్లకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకునే గతంలో నల్లా ఛానల్ నిర్మాణం చేపట్టి, నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే అధిక వర్షపు నీటిని గోదావరిలోకి మళ్లించే ఏర్పాట్లు చేశారని గుర్తుచేశారు.
ప్రస్తుతం నల్లా ఛానల్ ద్వారా గోదావరిలోకి నీటిని మళ్లించే వెంట్ 2 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తుతో ఉందని, వర్షాకాలంలో భారీగా నీరు చేరినప్పుడు ఈ సామర్థ్యం సరిపోకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ముంపు సమస్య కొనసాగుతోందని వివరించారు. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, పూడికతీత పనులు చేపట్టడం, అవసరమైన చోట్ల కొత్త డ్రైనేజీలు నిర్మించడం, వివిధ డ్రైనేజీ మార్గాలను అనుసంధానం చేయడం వంటి చర్యలు తీసుకుంటోందన్నారు.
అయినప్పటికీ నల్లా ఛానల్ వద్ద నీటి ప్రవాహ సామర్థ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిపుణుల సూచనలతో గుర్తించి, ప్రస్తుత వెంట్కు అదనంగా మరో వెంట్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అదనపు వెంట్ అందుబాటులోకి వస్తే తుమ్మలోవ, రామచంద్రరావుపేట, కంబాలచెరువు జంక్షన్, ఆర్యాపురం, లింగంపేటతో పాటు హైటెక్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లేందుకు దోహదపడుతుందన్నారు.
గతంలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు నడుములోతు వరకు నీరు నిలిచే పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం క్రమం తప్పకుండా పూడికతీత పనులు చేపట్టడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, అనుసంధాన మార్గాలను ఏర్పాటు చేయడం వల్ల నీటి నిల్వ తీవ్రత గణనీయంగా తగ్గిందన్నారు. అదనపు వెంట్ నిర్మాణం పూర్తయితే ముంపు సమస్యను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గోదావరి జలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
నగరంలో ముంపు సమస్య పరిష్కారంతో పాటు గోదావరి నదీ జలాలను పరిరక్షించడం కూడా తమ ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోందని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. వర్షపు నీటిని గోదావరిలోకి మళ్లించడం అవసరమే అయినప్పటికీ, రోజువారీగా వెలువడే మురుగునీరు నేరుగా నదిలో కలవకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో భాగంగా ఏబీ నాగేశ్వరరావు పార్కు వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
నగరంలోని వాడుకపు నీటిని వర్షపు నీటితో కలిపి నేరుగా గోదావరిలోకి వదలకుండా, మురుగునీటిని శుద్ధి కేంద్రాలకు తరలించి శుద్ధి చేసిన తర్వాతే తదుపరి నిర్వహణ చేపట్టేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఇందులో భాగంగా సుమారు రూ.2 కోట్లతో సాయి హాస్పిటల్ మీదుగా త్రీ టౌన్ వరకు పైప్లైన్ నిర్మాణ పనులు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు.
తాజాగా మరో రూ.2 కోట్లతో త్రీ టౌన్ నుంచి పుష్కర్ ఘాట్ మీదుగా గోదావరి గట్టు వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానం చేసే పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఈ మార్గం ద్వారా మురుగునీటిని డీలక్స్ సెంటర్ అవతల ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించడంతో సరిపెట్టకుండా, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపేలా నిపుణుల సలహాలతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం బాధ్యతాయుతమైన ప్రభుత్వ లక్షణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




