Rajahmundry: న్యాయవ్యవస్థలో సమూల సంస్కరణలు తేవాలి: మేడా శ్రీనివాస్!

Rajahmundry: న్యాయవ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టి 24 గంటలూ కోర్టులు పనిచేసేలా చూడాలని, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆర్పీసీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ కోరారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 1 Nov 2026 11:42 PM IST
Rajahmundry
X

Rajahmundry: న్యాయవ్యవస్థలో సమూల సంస్కరణలు తేవాలి: మేడా శ్రీనివాస్!

రాజమండ్రి: దేశంలో న్యాయవ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సమూల సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. న్యాయస్థానాలు 24 గంటలూ పనిచేసే విధంగా నూతన విధానాలు అమలు చేయాలని, నేరాలను నిరూపించేందుకు ప్రత్యేక దర్యాప్తు పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది కొరతను అధిగమించి కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కక్షిదారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి విశ్రాంతి గదులు, గ్రంథాలయాలు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.

నేర పరిశోధనలో నాణ్యత పెంచేందుకు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కోర్టుల్లో కిరాయి సాక్షుల వ్యవహారాలపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని తీసుకురావాలని సూచించారు. ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసే విధంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించే విధానాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. ప్రతి ఫిర్యాదుకు తక్షణమే రసీదు ఇచ్చే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం నేర పరిశోధనలో పాత విధానాలే కొనసాగుతున్నాయని, సరైన దర్యాప్తు, పటిష్టమైన ఆధారాల సేకరణ లేకపోవడంతో అనేక కేసుల్లో నేర నిరూపణ కష్టమవుతోందని విమర్శించారు. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు సాక్షుల భద్రతకు పోలీసు, న్యాయ వ్యవస్థలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిర్దోషులు భయంతో జీవిస్తూ, నేరస్తులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు మారాలన్నారు.

గతంలో రద్దు చేసిన టెలిగ్రామ్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించి మానవ హక్కుల పరిరక్షణకు, బాధితులకు రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రజలకు న్యాయం, భద్రత కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలని స్పష్టం చేశారు.

ప్రస్తుత రాజకీయ, పాలనా వ్యవస్థల్లో అవినీతి పెరిగిపోతోందని విమర్శించిన మేడా శ్రీనివాస్, యువత భవిష్యత్తు, సామాజిక భద్రత కోసం ప్రజలు చైతన్యవంతులై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంపద సమాజానికి ఉపయోగపడేలా, పేదరికం లేని సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

ఈ సమావేశానికి ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డి.వి. రమణమూర్తి, సిమ్మా దుర్గారావు, దుడ్డే సురేష్, ఎం.డి. హుస్సేన్, దుడ్డే త్రినాథ్, మేడిచర్ల శ్రీనివాసరావు, కారుమూరి యుగంధర్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY