Rajahmundry: రౌడీషీట్లకు కులాన్ని ముడిపెట్టడం తప్పు కుడుపూడి సత్తిబాబు

Rajahmundry: రౌడీషీట్లకు కులాన్ని ఆపాదించడం తప్పని, నేరచరిత్రను బట్టే చర్యలుంటాయని ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు స్పష్టం చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 28 Jun 2026 6:01 PM IST
Rajahmundry
X

Rajahmundry: రౌడీషీట్లకు కులాన్ని ముడిపెట్టడం తప్పు కుడుపూడి సత్తిబాబు

రాజమండ్రి: రౌడీషీట్లకు కులాన్ని ముడిపెట్టి మొత్తం సమాజాన్ని అపవాదుకు గురిచేయడం బాధ్యతారాహిత్యమని ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు అన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని డెల్టా ఆసుపత్రి పక్కన ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా శెట్టిబలిజ సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. గత ఏడాదిన్నర కాలంలో కార్పొరేషన్ ద్వారా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. శెట్టిబలిజల జీవనోపాధిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.

మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ కల్పించడం, రాష్ట్రంలో ఖాళీ అయిన బార్ లైసెన్సుల్లో తమ వర్గానికి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.

శెట్టిబలిజ, గౌడ తదితర ఐదు అనుబంధ కులాలు ఐక్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రయత్నాలకు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వవద్దని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో బీసీల గొప్ప నాయకుడు గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించినప్పుడు వైసీపీ నాయకుల్లో ఒక్కరూ స్పందించలేదని విమర్శించారు. ఆ సమయంలో బీసీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరూ ముందుకు రాలేదన్నారు. గౌతు లచ్చన్న కుటుంబానికి తాము అండగా నిలిచామని గుర్తుచేశారు.

శెట్టిబలిజ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మహోన్నత సేవలందించిన దొమ్మేటి వెంకటరెడ్డి సేవలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించేలా కృషి చేశామని తెలిపారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేయడం, విశాఖపట్నంలో అధికారిక వేడుకలు నిర్వహించడం, రాజమహేంద్రవరంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం కార్పొరేషన్ సాధించిన విజయాలని పేర్కొన్నారు.

లాలాచెరువు సెంటర్‌లో తన సొంత ఖర్చుతో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో అదే ప్రాంతంలో గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ ఇద్దరు మహనీయులు ఐదు బీసీ కులాల ఐక్యతకు ప్రతీకలని అన్నారు. శెట్టిబలిజల కోసం ప్రత్యేక కళ్యాణ మండపం నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

త్వరలోనే దీనిపై శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రౌడీషీట్ల అంశాన్ని కులానికి ఆపాదించడం పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎవరైనా వారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని, రౌడీషీట్లు కులాలను చూసి కాకుండా నేరచరిత్రను బట్టి మాత్రమే నమోదు చేస్తారని చెప్పారు.

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం చట్టం కఠినంగా అమలవ్వాలని అభిప్రాయపడ్డారు. శెట్టిబలిజ జీవనోపాధి మెరుగుపర్చేందుకు తాటి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు.

ఆదరణ పథకం కింద పనిముట్ల కొనుగోలుకు రూ.15 వేల ఆర్థిక సాయం, తక్కువ వాటాతో వాహనాల పంపిణీ వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. తాటి ఉత్పత్తుల విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి 'నీరా' ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని తెలిపారు.

తొలి విడతలో రంపచోడవరం ప్రాంతంలో 50 మంది యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో యూనిట్ ద్వారా సుమారు రూ.3 కోట్ల వరకు ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని, గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.

గత ప్రభుత్వ కాలంలో సెట్టిబలిజల సమస్యలను పట్టించుకోని వారు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమాజానికి నిజంగా ఉపయోగపడే అంశాలపై చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తే తాము కూడా పాల్గొంటామని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టే సమావేశాలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ యువతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీ అని పేర్కొంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు. ఆ విశ్వాసానికి తగ్గట్టుగా సమాజ సేవ చేస్తానని చెప్పారు.

రాబోయే రోజుల్లో శెట్టిబలిజలకు మరిన్ని కీలక పదవులు, సంక్షేమ కార్యక్రమాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. కులాల మధ్య విభేదాలు కాకుండా ఐక్యతే అభివృద్ధికి మార్గమని, సెట్టిబలిజలంతా ఒక్కటిగా ఉండి కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ మీడియా సమావేశంలో చింతపల్లి నాని, చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి, సాయి గణేష్, పిల్లి శ్రీను, మహేష్, గణేష్ తదితర శెట్టిబలిజ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story