Rajahmundry: 42 డివిజన్లలోనూ కూటమి గెలుపే లక్ష్యం ఎమ్మెల్యే ఆదిరెడ్డి
Rajahmundry: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో 42 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి 100% విజయం సాధిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
Rajahmundry: 42 డివిజన్లలోనూ కూటమి గెలుపే లక్ష్యం ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమండ్రి: రానున్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 42 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార కార్యక్రమాల వరకు అన్ని అంశాల్లో ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని తెలిపారు.
ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సుమారు 9,700 మందితో నిర్వహించిన సర్వేలో కూటమి ప్రభుత్వ పనితీరుపై 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, ఎమ్మెల్యేగా తన పనితీరుకు ప్రభుత్వ పనితీరు కంటే మరో ఏడు శాతం అధికంగా సానుకూల స్పందన లభించిందని చెప్పారు. తిలక్ రోడ్డులోని రెడ్డి కన్వెన్షన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆదిరెడ్డి కుటుంబ రాజకీయ ప్రస్థానంలో మీడియా సభ్యుల సహకారం, ఆశీర్వాదాలను ఎప్పటికీ మరువలేమన్నారు. తన తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్‌గా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు మీడియా అందించిన సహకారం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే అనుబంధం కొనసాగాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ మీడియా ప్రతినిధుల కుటుంబాల్లో, మీడియా సంస్థల్లో వెలుగులు నింపాలని శుభాకాంక్షలు తెలిపారు.
నగరంలో గత రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యేగా భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాలపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఒక్కో డివిజన్లో సగటున 200 మంది నుంచి, భౌగోళిక విస్తీర్ణాన్ని బట్టి అంతకంటే ఎక్కువ మందిని కలిపి మొత్తం 9,700 శాంపిల్స్ సేకరించినట్లు వివరించారు.
నగరంలోని 42 డివిజన్లలోనూ కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత కనిపిస్తోందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన యువత ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని, రాష్ట్రంలో ఏర్పడుతున్న పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 50 ఏళ్లు పైబడిన వారిలో కొత్త పెన్షన్ల మంజూరుపై సానుకూల స్పందన ఉందన్నారు. నియోజకవర్గానికి సుమారు 5,600 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు.
శాంతిభద్రతలు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
2024 ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో మహిళల భద్రత, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి, అల్లరిమూకలు, రౌడీయిజం ప్రధాన సమస్యలుగా ప్రజలు ప్రస్తావించారని గుర్తు చేశారు. వాటి పరిష్కారానికి 'మీ భద్రత.. మా బాధ్యత' కార్యక్రమాన్ని చేపట్టి, మహిళలతో చర్చించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఆ సమస్యల ప్రస్తావన తగ్గిందని తెలిపారు.
అయితే పారిశుధ్యం, డ్రైనేజీ తదితర అంశాలపై మరింత దృష్టి సారించాలని ప్రజలు సూచించారని చెప్పారు. ప్రత్యేకంగా 47, 48, 49వ డివిజన్లలో అక్రమ మద్యం విక్రయాల వల్ల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సర్వేలో వెల్లడైందన్నారు. గత ఐదారేళ్లుగా సారా విక్రయాలపై పోరాటం చేస్తున్నానని, అక్రమ విక్రయాలపై సమాచారం అందించాలని తన ఫోన్ నంబర్‌తో ఇళ్లకు స్టిక్కర్లు కూడా అంటించానని చెప్పారు.
ఈ వ్యవహారంలో ఎక్సైజ్ సిబ్బంది పాత్రపై ఆధారాలతో ఫిర్యాదులు అందించడంతో చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయని తెలిపారు. ప్రతి డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో ప్రత్యేక కరపత్రాలను రూపొందించి ప్రజల్లోకి వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ట్రాన్స్ఫార్మర్లు, పుష్కరాల పనులకు మంజూరైన నిధులు తదితర వివరాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు.
నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గోదావరి రివర్ ఫ్రంట్, క్రీడాకారుల కల అయిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమృత్ 2.0 ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. బొమ్మూరు హైవే సమీపంలో పది ఎకరాల స్థలాన్ని గుర్తించి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పనులు త్వరలో ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను సమీకరిస్తున్నామని చెప్పారు. జాంపేటలోని లూథరన్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు భోజన వసతి కోసం తొలుత షెడ్ నిర్మించాలని భావించామని, అయితే దేవిచౌక్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రూ.20 లక్షలతో శాశ్వత కాంక్రీట్ స్లాబ్ నిర్మాణానికి ముందుకొచ్చారని తెలిపారు.
ప్రజాప్రతినిధులపై నమ్మకంతో దాతలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 42 డివిజన్లకు వందలాది మంది ఆశావహులు ఉన్నప్పటికీ, అందరూ కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అభ్యర్థుల ఎంపిక విషయంలో కూటమి పెద్దలు తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని తెలిపారు.
ఆశించిన టికెట్ రాని నాయకులకు కూడా రాజకీయంగా తగిన అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి కేటాయించినా స్వాగతిస్తానని, డిప్యూటీ మేయర్ పదవిపై కూడా నాయకత్వం తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. తన విజయానికి జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సహకారం ఎంతో ఉందని, వారి రాజకీయ ఎదుగుదలకు తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా కనీసం రెండుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాలని కూటమి నిర్ణయించిందన్నారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, డివిజన్ల సరిహద్దులు, రిజర్వేషన్లకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
రిజర్వేషన్ల మార్పులపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, వాటిని తాను నిర్ణయించలేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లు ఎక్కువగా రావడం వల్ల కొన్ని రాజకీయ ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈ ప్రక్రియలో సాంకేతిక అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లను తొలగించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో సుమారు 800 కొత్త పెన్షన్లు అందించామని, అదనంగా మరో 5 వేల పెన్షన్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు 8 వేల కొత్త రేషన్ కార్డులు అందించామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా చేపట్టిన మ్యాపింగ్ విధానం వల్ల అనేక కుటుంబాలకు రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అందేలా రానున్న రెండు మూడు నెలల్లో చర్యలు చేపడతామని వెల్లడించారు. నగరం మత సామరస్యానికి వేదికగా కొనసాగుతోందని, అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.
రంజాన్ సందర్భంగా మసీదుల్లో ఇఫ్తార్ కార్యక్రమాలు, క్రిస్మస్ సందర్భంగా చర్చిల్లో వేడుకలు, హిందూ పండుగల సందర్భంగా ఆలయాలు, మండపాలను సందర్శిస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్తున్నామని తెలిపారు. నగరంలో ప్రతి ఒక్కరూ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించేలా చూడటం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటుతూ 42 డివిజన్లలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం వంటి ప్రాంతాల్లో ఎదురైన రాజకీయ పరిస్థితులు రాజమహేంద్రవరంలో పునరావృతం కాకుండా సమన్వయంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కాగా మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమాధానమిచ్చారు.




