Rajahmundry: వైద్యం, విద్య, రక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి

Rajahmundry: రూ.5.69 కోట్ల సీఎమ్‌ఆర్‌ఎఫ్ నిధుల పంపిణీ. విద్య, శాంతిభద్రతలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 1 July 2026 6:27 PM IST
Rajahmundry
X

Rajahmundry: వైద్యం, విద్య, రక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి

రాజమండ్రి: ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి వైద్యం, విద్య, శాంతిభద్రతలు అనే మూడు అంశాలు అత్యంత కీలకమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రియాంక గార్డెన్స్ ఎదురుగా ఉన్న లీలా ఫెవెలియన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కూటమి నాయకులతో కలిసి మాట్లాడారు.

సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.5.69 కోట్ల సాయం

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అత్యంత గొప్ప సంక్షేమ కార్యక్రమమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 2019 నాటికి పెండింగ్‌లో ఉన్న 23 దరఖాస్తులను కూడా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు, రాజకీయాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మొత్తం 686 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ సహాయం అందిందన్నారు.

మొత్తం సహాయం రూ.5,69,91,934 అని వెల్లడించారు. అంతకుముందు 596 చెక్కుల ద్వారా రూ.5,07,81,071 పంపిణీ చేశామని తెలిపారు. ఈ రోజు 87 చెక్కులు, 3 ఎల్‌ఓసీలు కలిపి రూ.62,10,863 విలువైన సహాయం అందజేశామని చెప్పారు. ఇంకా 83 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, వాటి విలువ రూ.1,12,54,954 అని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి రాని పేదలను కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటోందని చెప్పారు.

విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత

ఒక తరం భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య మాత్రమేనన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రతి పథకానికి రాజకీయ నాయకుల పేర్లు పెట్టారని, ప్రస్తుతం సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థుల కిట్లు, డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం గొప్ప ఆలోచనను ప్రతిబింబించిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలకు రూ.1.02 కోట్ల సీఎస్ఆర్ నిధులు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1,02,03,548 సమీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేషనల్ స్కూల్, మోరంపూడి స్కూల్, విఎల్‌పురం శ్యామలాంబ స్కూల్‌లలో పదో తరగతి ప్రారంభించామని చెప్పారు. నేషనల్ స్కూల్‌కు ఐడీబీఐ బ్యాంక్ సీఎస్ఆర్ ద్వారా రూ.15 లక్షలతో ల్యాప్‌టాప్‌లు, టేబుళ్లు తదితర సామగ్రి అందించామని తెలిపారు.

మోరంపూడి పాఠశాలలో 9, 10వ తరగతి గదుల కోసం రూ.50 లక్షల సీఎస్ఆర్ నిధులతో కొత్త భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. విఎల్‌పురం శ్యామలాంబ పాఠశాలలో రూ.55 లక్షల సీఎస్ఆర్ నిధులతో కొత్త భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా అనేక ప్రభుత్వ పాఠశాలలకు ఆర్‌ఓ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డు ఫలితాలు

గత ఏడాది పదో తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 180 మంది కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 275 మందికి పెరిగిందన్నారు. అలాగే 590 మార్కులకు పైగా ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచే సాధించారని తెలిపారు. ఇది లోకేష్ అమలు చేస్తున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఫలితమని పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 12,573గా ఉందన్నారు.

కూటమి నాయకులు, విద్యాశాఖ సిబ్బంది కలిసి ఇంటింటికీ వెళ్లి నిర్వహించిన "బడి పిలుస్తుంది" కార్యక్రమం ద్వారా ఈ ఏడాది 378 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని గర్వంగా తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.

శాంతిభద్రతలపై రాజీ లేదు

ప్రజల భద్రతే ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికడతామని చెప్పామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 120 మందికి పైగా రౌడీషీట్లు తెరిచామని, 21 మందిపై పీడీ యాక్టు నమోదు చేశామని, గంజాయి వ్యాపారులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని, సారా మాఫియాపై ఉక్కుపాదంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు.

వైసీపీ నేతల ఆడియోపై స్పందన

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫోన్ సంభాషణలో హత్యలు, తలలు నరికేస్తామంటూ మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని ఎమ్మెల్యే అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. అధికార పార్టీలో ఉన్నా, కూటమి పార్టీలకు చెందిన వారైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలే ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయిస్తారని, బెదిరింపులు, హింసా రాజకీయాలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

నగరంలోని ప్రముఖ దేవాలయానికి కొత్త ఎండోమెంట్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. జనసేన నాయకుడు గురుమూర్తిని చైర్మన్‌గా నియమించి, టీడీపీ, బీజేపీ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శిథిలావస్థలో ఉన్న విగ్రహానికి కంచి పీఠాధిపతి, ఎండోమెంట్ శాఖ అనుమతులతో కొత్త విగ్రహాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఊరేగింపుగా దేవాలయానికి విగ్రహం తీసుకొస్తామని, 8వ తేదీన పునఃప్రతిష్ఠ నిర్వహిస్తామని, 9వ తేదీన అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అలాగే మార్కండేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని వెల్లడించారు.

యాసిడ్ పురుగుపై భయపడొద్దు

యాసిడ్ పురుగు విషయంలో ప్రజలు అవసరానికి మించి భయపడవద్దని ఎమ్మెల్యే సూచించారు. తనకు గతంలో ఈ పురుగుతో అనుభవం ఉందని చెబుతూ, దానిని నలిపితే మాత్రమే ద్రవం విడుదలై చర్మంపై మంట కలుగుతుందని, నలపకుండా దులిపేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం 90 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వైద్యాధికారి డివి చలపతిరావు వివరణ

అనంతరం మాట్లాడిన వైద్యాధికారి డివి చలపతిరావు యాసిడ్ పురుగు (రోవ్ బీటిల్) గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పురుగు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంటుందని, పంటలకు హాని చేసే చీడపీడలను తినే పర్యావరణహిత జీవి అని తెలిపారు. ఇది మనిషిని కుట్టదని, అయితే దానిని చేతితో నలిపితే విడుదలయ్యే టాక్సిన్ చర్మంపై పడితే 24 నుంచి 36 గంటల్లో మంట, దురద, నీటి బుడగలు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.

అలాంటి పరిస్థితిలో వెంటనే సబ్బు నీటితో కడుక్కోవాలని, చల్లటి కాపడం పెట్టుకోవాలని, అవసరమైతే కాలమైన్ లోషన్, స్టెరాయిడ్ ఆయింట్‌మెంట్ లేదా వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని సూచించారు. కంటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. చివరగా ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యాధికారి స్పష్టం చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story