Rajahmundry: ఏడేళ్ల నిరీక్షణకు ముగింపు డీఎస్సీ విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే
Rajahmundry: రాజమండ్రిలో డీఎస్సీ విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు). కష్టపడి సాధించిన ఉద్యోగాలపై వైసీపీ దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు.
Rajahmundry: ఏడేళ్ల నిరీక్షణకు ముగింపు డీఎస్సీ విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే
Rajahmundry: ఇటీవల జరిగిన డీఎస్సీలో విజయం సాధించి ఉపాధ్యాయులుగా నియామకం పొందిన నగరానికి చెందిన ఐదుగురు నూతన ఉపాధ్యాయినులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్వయంగా కలిసి అభినందించారు. వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి విజయ గాథలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయినులు 10వ డివిజన్‌కు చెందిన ముసలిగంటి సంతోషి రమా కల్యాణి, 3వ డివిజన్‌కు చెందిన గంటి గేయరూపిణి, 45వ డివిజన్‌కు చెందిన నయనాల కేదారేశ్వరి, 37వ డివిజన్‌కు చెందిన గిరిజ కుమారి, 35వ డివిజన్‌కు చెందిన కుసుమ రత్న సౌజన్యలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలిసి వారి విజయాన్ని అభినందించారు. వారిని సత్కరించి, ప్రత్యేకంగా నగరానికి చెందిన ప్రసిద్ధ రత్నం పెన్నులను జ్ఞాపికగా అందజేశారు.
గర్భిణీగా ఉన్నప్పుడే చదివి విజయం
డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో తాను గర్భిణీ అని ఓ అభ్యర్థిని తెలిపారు. ప్రసవం జరిగిన తర్వాత కూడా పరీక్షకు సిద్ధమై, తీవ్ర శ్రమతో పరీక్ష రాసి విజయం సాధించడం అందరినీ కదిలించింది. కుటుంబ బాధ్యతలు, శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువును వదలకుండా ఉద్యోగం సాధించిన ఆమె పట్టుదలను ఎమ్మెల్యే వాసు ప్రత్యేకంగా అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివి.. మళ్లీ ప్రభుత్వ టీచర్‌గా
మరో ఉపాధ్యాయిని ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఇప్పుడు అదే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయురాలిగా సేవలందించే స్థాయికి చేరడం పట్ల ఎమ్మెల్యే వాసు హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చదువు కొనసాగించి ఉద్యోగం సాధించిన వారి కృషిని కొనియాడారు.
భర్త ప్రోత్సాహంతో కల నెరవేర్చుకున్న ఉపాధ్యాయిని
చిన్న వయసులోనే వివాహం జరిగినప్పటికీ చదువును ఆపకుండా, భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యను పూర్తి చేసి డీఎస్సీ సాధించిన ఉపాధ్యాయినితో కూడా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. ఆమె విజయం వెనుక కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త అందించిన ప్రోత్సాహం కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఏడేళ్ల నిరీక్షణకు తెర.. జీవిత లక్ష్యాన్ని సాధించాం
నూతన ఉపాధ్యాయినులు మాట్లాడుతూ డీఎస్సీ కోసం అనేక సంవత్సరాలుగా నిరీక్షించామని, ఉద్యోగం సాధించడమే తమ జీవిత లక్ష్యంగా రాత్రింబవళ్లు కష్టపడి చదివామని తెలిపారు. కుటుంబం, పిల్లలు, వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఉద్యోగం కోసం ఎంతో శ్రమించామని, చివరకు తమ కల నెరవేరడం ఎంతో ఆనందంగా ఉందని భావోద్వేగంగా చెప్పారు. డీఎస్సీ ఉద్యోగాలు తమ జీవితాలను మార్చాయని, కుటుంబానికి భరోసా కల్పించాయని పేర్కొన్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
డీఎస్సీపై దుష్ప్రచారం సరికాదు : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురుచూసిన వేలాది మంది అభ్యర్థులు తీవ్రంగా కష్టపడి ఈ ఉద్యోగాలను సాధించారన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ నిర్వహించి, అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై వైకాపా అవినీతి ఆరోపణలు చేయడం, డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుగోలు చేశారంటూ ప్రచారం చేయడం డిఎస్సీ అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. నూతన ఉపాధ్యాయులు ఎలాంటి అపోహలకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. “నిజం ఎప్పటికైనా నిజమే... అబద్ధాన్ని పదిసార్లు చెప్పినంత మాత్రాన అది నిజం కాదు... మీ కష్టంతో మీరు ఉద్యోగాలు సాధించారు... మీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ధైర్యంగా ఎదుర్కొనాలి” అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉపాధ్యాయినులతో అన్నారు.
మీ చేతుల్లో భవిష్యత్ తరాలు
కొత్తగా ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన వారికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందనలు తెలుపుతూ, మీ చేతుల ద్వారా భవిష్యత్తులో మంచి విద్యార్థులను, బాధ్యతాయుతమైన పౌరులను, ఉత్తమ అధికారులను తయారు చేయాలని ఆకాంక్షించారు. “మీ విజయం ఇక్కడితో ఆగిపోకూడదు. మీరు చదివించే పిల్లలు భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరేలా తీర్చిదిద్దాలి... గురుదేవోభవ అన్న మాటకు తగ్గట్టుగా ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తీసుకురావాలి” అని సూచించారు.




