Rajahmundry: రూ. 7 కోట్లతో 49వ డివిజన్ అభివృద్ధి: ఎమ్మెల్యే వాసు
Rajahmundry: రూ. 7 కోట్లతో 49వ డివిజన్‌ను అభివృద్ధి చేస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రూ 18.70 లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు
Rajahmundry: రూ. 7 కోట్లతో 49వ డివిజన్ అభివృద్ధి: ఎమ్మెల్యే వాసు
రాజమండ్రి:
పుష్కరాల నాటికి 49వ డివిజన్‌లో రూ.7 కోట్లతో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రూ.18.70 లక్షలతో సింహాచలం నగర్ ప్రాంతంలో చేపట్టనున్న డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 49వ డివిజన్‌లోని సింహాచలం నగర్ నగర్, సుబ్బారావు నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే రూ.80 లక్షలతో వివిధ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎండీస్ పేటలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం వంటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. మరో రూ.45 లక్షల విలువైన పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని చెప్పారు. టిడ్కో గృహాల్లో గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రజలను నివాసాలకు తరలించిందని విమర్శించారు. డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో హౌసింగ్ చుట్టూ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో పాటు మేజర్ డ్రైన్‌ను నిర్మించిందని వివరించారు. ప్రస్తుతం డ్రైనేజీ నీరు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేలా 12 కల్వర్టులను నిర్మించి, వాటి ఎత్తు పెంచే పనులను రూ.18.70 లక్షలతో చేపడుతున్నామని తెలిపారు. భారీ వర్షాలు కురిసినా నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కారం అందించే విధంగా ఈ పనులు ఉంటాయని పేర్కొన్నారు. పుష్కరాల దృష్ట్యా మరో రూ.7 కోట్లతో ఈ డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులను చేపడుతున్నామని, పుష్కరాలు వచ్చే నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. సింహాచలం నగర్‌లో గతంలో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన పార్కును రూ.70 లక్షలతో ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో అక్కడ బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి సేవించే వారి అడ్డాగా మారిందని, ప్రస్తుతం లా అండ్ ఆర్డర్‌కు ప్రాధాన్యం ఇచ్చి అలాంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టామని చెప్పారు. పార్కులో మహిళలు, కుటుంబ సభ్యులు నిర్భయంగా వాకింగ్ చేయడానికి అనువుగా చుట్టూ ప్రహరీ గోడ ఎత్తు పెంచడంతో పాటు, ఎవరూ రాత్రివేళల్లో లోపలికి ప్రవేశించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యకరమైన జీవనం, మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులను సంప్రదించాలని, పరిష్కారం కాకపోతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటం కూటమి ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. డివిజన్ ఇంచార్జ్ దుత్తరపు గంగాధర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




