Rajahmundry: 21వ డివిజన్‌లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
Rajahmundry: రాజమండ్రి 21వ డివిజన్ యర్రాళ్ల వారి వీధిలో రూ.7.56 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: 21వ డివిజన్‌లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
రాజమండ్రి: స్థానిక 21వ డివిజన్‌లో ఏళ్ల తరబడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న నీట ముంపు సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 21వ డివిజన్ యర్రాళ్ల వారి వీధిలో రూ.7.56 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యర్రాళ్ల వారి వీధి లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా ఇక్కడే నిలిచిపోయి, డ్రైన్ల ద్వారా బయటకు వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టేదన్నారు. దీంతో ప్రతి భారీ వర్షానికీ ఈ ప్రాంతం నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుండేదని తెలిపారు.
ఈ సమస్యకు పరిష్కారంగా నీట ముంపు ప్రాంతాన్ని సుమారు 1.5 అడుగుల మేర ఎత్తు పెంచే పనులకు రూ.8 లక్షలతో శ్రీకారం చుట్టామని తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో 21వ, 22వ డివిజన్లలోని పలు లోతట్టు ప్రాంతాల నుంచి నీటిని గోదావరిలోకి వదిలే పరిస్థితి ఉండేదని ఎమ్మెల్యే గుర్తుచేశారు.
అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు గోదావరి నది కలుషితం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని తెలిపారు. సుమారు 70 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు నిర్మించిన మేజర్ డ్రైన్‌ను పునరుద్ధరించామని చెప్పారు. పూర్తిగా పూడుకుపోయి నిరుపయోగంగా ఉన్న ఈ డ్రైన్‌ను సుమారు రెండు నెలల పాటు శుభ్రం చేసి, రెండు వెంటుల ద్వారా సీతార ప్రాంతం వద్ద కలిపే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇకపై వర్షపు నీరు మేజర్ డ్రైన్ ద్వారా సరైన డ్రైనేజీ వ్యవస్థలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. మేజర్ డ్రైన్‌లోకి నీరు చేరేందుకు ఉన్న నాలుగు వెంటులు చిన్నగా ఉండటంతో, అవసరమైన వేగంతో నీరు వెళ్లడం లేదని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన అనుభవజ్ఞులైన తెలుగుదేశం పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఆ నాలుగు వెంటులను విస్తరించేందుకు రూ.6 లక్షలతో పనులు చేపట్టనున్నామని చెప్పారు.
ప్రస్తుతం టెండర్ దశలో ఉన్న ఈ పనులు మరో 15 రోజుల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పనులన్నీ పూర్తయితే గంటల కొద్దీ నీరు నిలిచిపోయే పరిస్థితి నుంచి నిమిషాల్లోనే నీరు సక్రమంగా డ్రైనేజీ వ్యవస్థ ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా మురుగు నీరు, పారిశుధ్య నీరు చుక్క కూడా గోదావరి నదిలో కలవకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
21వ డివిజన్‌తో పాటు నగరంలోని ప్రతి ప్రాంత అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతూ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు సమిష్టిగా నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న నీట ముంపు సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించడం గర్వకారణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




