Rajahmundry: మోడల్ కాలనీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ శంకుస్థాపన!

Rajahmundry: రాజమహేంద్రవరం మోడల్ కాలనీలో రూ.15.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి హామీ.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 16 Sept 2026 2:46 PM IST
Rajahmundry
X

Rajahmundry: మోడల్ కాలనీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ శంకుస్థాపన!

Rajahmundry: ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక 10వ డివిజన్ మోడల్‌ కాలనీలో రూ.15.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మోడల్‌ కాలనీ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెద్ద సంఖ్యలో అపార్ట్‌మెంట్లు నిర్మాణం అవుతున్న నేపథ్యంలో ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడం కార్పొరేషన్‌ బాధ్యతన్నారు.

గత ఐదేళ్లుగా డ్రైనేజీ సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, అపార్ట్‌మెంట్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితిని తన దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. సుమారు 270 మీటర్ల డ్రైనేజీ నిర్మాణంతో పాటు నాలుగు కల్వర్టుల పనులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ముందుగా అవసరమైన డ్రైనేజీ, రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఇతర నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

గతంలో జరిగిన తప్పిదాలను తవ్వుకుంటూ వెళ్లకుండా, ప్రస్తుతం ప్రజలకు అవసరమైన పనులను పూర్తి చేయడంపైనే కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు కోరుతున్న అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY