Rajahmundry: రాజమండ్రిలో 'మన వార్డులో మన ఆదిరెడ్డి' కార్యక్రమం
Rajahmundry: రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన వార్డులో... మన ఆదిరెడ్డి' కార్యక్రమం.
Rajahmundry: రాజమండ్రిలో 'మన వార్డులో మన ఆదిరెడ్డి' కార్యక్రమం
రాజమండ్రి: ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చేపట్టిన 'మన వార్డులో... మన ఆదిరెడ్డి' కార్యక్రమం మంగళవారం రాత్రి 45, 46 డివిజన్ల పరిధిలోని రామదాసుపేటలో కొనసాగింది. పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసిన ఎమ్మెల్యే వాసు బుధవారం ఉదయం ప్రజలతో కలిసి డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక ప్రజలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించారు. డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు వంటి పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
'మన వార్డులో... మన ఆదిరెడ్డి' కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించడం పట్ల స్థానికులు ఎమ్మెల్యేను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.




