Rajahmundry: నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి ఎమ్మెల్యే!

Rajahmundry: రాజమండ్రిలో పారిశుద్ధ్య సంతృప్తి స్థాయిని 80 శాతానికి పెంచాలి. అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశం.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 19 Aug 2026 12:16 PM IST
Rajahmundry
X

Rajahmundry: నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి ఎమ్మెల్యే!

Rajahmundry: నగర పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచి ప్రజల్లో సంతృప్తి స్థాయిని 68 శాతం నుంచి 80 శాతానికి పెంచేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నగర పాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులతో ఆయన పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా నగరంలోని పారిశుద్ధ్య పరిస్థితులు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, చెత్త సేకరణ, డీ-సిల్టింగ్, ఫాగింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం పారిశుద్ధ్యంపై ప్రజల్లో 68 శాతం సంతృప్తి ఉందని, దీనిని 80 శాతానికి చేర్చే లక్ష్యంతో అందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు.

పారిశుద్ధ్య విభాగంలో రిటైర్‌మెంట్, మృతిచెందిన తదితర కారణాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తూ 79 మంది కార్మికులను కొత్తగా తీసుకున్నామని తెలిపారు. అదనంగా పనిచేస్తున్న 185 మంది కార్మికుల వేతనాలను రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పెంచామని వెల్లడించారు.

అలాగే వాహనాలపై పనిచేసే సిబ్బంది వేతనాలను కూడా రూ.18,500కు పెంచినట్లు తెలిపారు. నగరంలో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి వార్డుకు ప్రత్యేక పారిశుద్ధ్య షెడ్యూల్ రూపొందించి, నిర్దేశిత పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఒక వారం పూర్తయిన వెంటనే తదుపరి వారంలో అదే క్రమంలో పనులు పునరావృతమయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. డీ-సిల్టింగ్, ఫాగింగ్, గ్యాంగ్ వర్క్‌తో పాటు ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, డ్రైనేజీల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు తెలిపారు.

ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా నగరంలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రజల సంతృప్తిని 80 శాతానికి పెంచే లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story