Rajahmundry: రాజమండ్రిలో ముమ్మరంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే వాసు

Rajahmundry: రాజమండ్రి 37, 41, 42 డివిజన్లలో రూ.28 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 26 July 2026 6:55 AM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో ముమ్మరంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే వాసు

రాజమండ్రి: నగర అభివృద్ధికి ప్రజల విశ్వాసమే తమకు అతిపెద్ద బలమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా 37, 41, 42 డివిజన్లలో రూ.28 కోట్లకు పైగా వ్యయంతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టి వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటి వద్దకు అభివృద్ధి ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

37, 41, 42 డివిజన్లలో నిర్వహించిన "మన వార్డులో – మన ఆదిరెడ్డి" కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) విస్తృతంగా మాట్లాడారు. ముందుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

అనంతరం జరిగిన సభలో గత ఎన్నికల ఫలితాలు, రెండు సంవత్సరాల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మహిళల భద్రత, పుష్కరాల ఏర్పాట్లు, దేవాలయాల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మూడు డివిజన్లలో కూటమి బలం ప్రతి ఎన్నికలో మరింత పెరుగుతోందని అన్నారు.

2019లో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ రాజమహేంద్రవరం ప్రజలు కూటమి పక్షాన నిలిచారని గుర్తుచేశారు. 37వ డివిజన్‌లో 2019లో భవాని కి 841 ఓట్ల మెజారిటీ రాగా, 2024లో కూటమి అభ్యర్థిగా తనకు 2,358 ఓట్ల మెజారిటీ లభించిందన్నారు. అలాగే 41వ డివిజన్‌లో 2019లో 385 ఓట్ల మెజారిటీ ఉండగా, 2024లో అది 1,575కు పెరిగిందన్నారు. 42వ డివిజన్‌లో 2019లో సుమారు 600 ఓట్ల మెజారిటీ ఉండగా, 2024లో 2,142 ఓట్ల మెజారిటీ రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ మెజారిటీలు యాదృచ్ఛికంగా రాలేదని, ప్రజల అవసరాలకు వెంటనే స్పందించడం, సమస్యలను పరిష్కరించడం, అందుబాటులో ఉండడం వల్లే ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఈ మూడు డివిజన్లలో కూటమి మెజారిటీలు మరింత పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, పోలీసు, విద్యుత్, పారిశుద్ధ్య శాఖల సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ 37, 41, 42 డివిజన్లకు చెందిన కూటమి నాయకులు ఏ సమస్య తీసుకొచ్చినా అది ప్రజా సమస్యగా భావించి స్పందించాలని కోరారు.

ఎవరైనా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి చెప్పితేనే స్పందిద్దామనే భావన కాకుండా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. రెండు సంవత్సరాల పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నామని ప్రకటించారు. మూడు పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కాలనీ, రత్నంపేట, లోధరిగెరి వంటి ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. రత్నంపేట పంప్ హౌస్ నుంచి ఎత్తైన ప్రాంతాలైన వాంబే కాలనీల వరకు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. లోధరిగెరిలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు అందేలా పనులు పూర్తి చేశామని, మిగిలిన రెండు మూడు రోడ్లను కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

37వ డివిజన్‌లో జయకృష్ణపురం, గణేష్ నగర్, లలితానగర్ తదితర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. ప్రజా దర్బార్ల ద్వారా పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తూ సచివాలయాల ద్వారా అర్హులందరికీ సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆగస్టులో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నామని, ఇప్పటికే నియోజకవర్గంలో 3,100 కొత్త పెన్షన్ దరఖాస్తులు అర్హత సాధించాయని వెల్లడించారు. "తల్లికి వందనం" పథకం కింద ఒక్క రాజమహేంద్రవరం నియోజకవర్గానికే రూ.60 కోట్లు విడుదలయ్యాయని, 47 వేల మంది విద్యార్థులకు, 34,040 మంది తల్లుల ఖాతాల్లో నేరుగా నిధులు జమయ్యాయని తెలిపారు.

అర్హత ఉండి డబ్బులు రాని వారు సచివాలయాల్లో వివరాలు సరిచేసుకుంటే ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని వివరించారు. కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో 8,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని, గత ఐదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు, ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అలాగే చెత్త పన్నును పూర్తిగా రద్దు చేసి ప్రజలపై భారం తగ్గించామని గుర్తు చేశారు.

అభివృద్ధి గణాంకాలను వెల్లడిస్తూ 37వ డివిజన్‌లో ఇప్పటికే రూ.70 లక్షల పనులు పూర్తయ్యాయని, మరో రూ.2 కోట్ల పనులు కొనసాగుతున్నాయని, పుష్కరాల కోసం రూ.9.41 కోట్ల ప్రతిపాదనలు ఆమోదం పొందాయని తెలిపారు. 41వ డివిజన్‌లో రూ.1.70 కోట్ల పనులు పూర్తయ్యాయని, పుష్కరాల కోసం రూ.9.24 కోట్ల పనులకు ఆమోదం లభించిందన్నారు. 42వ డివిజన్‌లో రూ.85 లక్షల పనులు పూర్తి కాగా, రూ.4.57 కోట్ల అభివృద్ధి పనులకు అనుమతులు వచ్చాయని వివరించారు.

వరదనీటి సమస్యల పరిష్కారానికి బోధి స్కూల్, బీరువాల వీధి తదితర ప్రాంతాల్లో రోడ్ల ఎత్తు పెంచడం, భారీ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టడంతో గతంలో గంటల తరబడి నిలిచే నీరు ఇప్పుడు నిమిషాల్లో వెళ్లిపోతోందని చెప్పారు. మహిళల భద్రత కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. మహిళలను వేధించే వారిపై పార్టీతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెండు సంవత్సరాల్లో 130 మందిపై రౌడీషీట్లు నమోదు చేశామని, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళలు రాత్రి వేళల్లో కూడా భయపడకుండా తిరిగే పరిస్థితి తీసుకురావడమే లక్ష్యమన్నారు. విద్యుత్ సమస్యలపై మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లో నియోజకవర్గంలో 160 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని, తక్కువ వోల్టేజ్ సమస్యలున్న ప్రతి ప్రాంతంలో అవసరమైన చోట మరిన్ని ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐదు కొత్త సబ్‌స్టేషన్లకు స్థలాలు కేటాయించి, టెండర్లు పూర్తి చేశామని, దీంతో వచ్చే 30–40 సంవత్సరాల విద్యుత్ అవసరాలు తీరుతాయని తెలిపారు. 42వ డివిజన్‌లో మార్కెట్ యార్డు వెనుక మహిళల కోసం ప్రత్యేక వాకింగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని, పుష్కరాలు ముగిసిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అదే ప్రాంతంలో రూ.98 లక్షల వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించనున్నట్లు ప్రకటించారు.

కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, గతంలో నూతన సంవత్సర వేడుకల్లో తరచూ జరిగే ప్రమాదాలు, అల్లర్లు తగ్గిపోయాయని పేర్కొన్నారు. నగరంలో వెలుతురు లేని ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేసి నేరాలను అరికడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా కార్యకర్తల ఇళ్లలో బస చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నానని, ఇది కార్యకర్తలకు భరోసా కల్పించడానికేనని చెప్పారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నిమిషకవి ఇంటిలో రాత్రి బస చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో విశాఖలో బీసీ హాస్టల్‌లో కూడా బస చేశానని గుర్తు చేశారు. దేవాలయాల అభివృద్ధిపై మాట్లాడుతూ ఎండోమెంట్స్ శాఖ ద్వారా నగరానికి రూ.15 కోట్ల నిధులు తీసుకొచ్చామని, గతంలో లేని విధంగా 14 ఎండోమెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసి సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మార్కండేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ, జాంపేట శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ, సత్యనారాయణస్వామి ఆలయానికి రూ.1 కోటి, పందిరి మహాదేవుని దేవస్థానానికి రూ.3 కోట్లు, గాంధీ విజయానికి రూ.4 కోట్లు, వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.30 లక్షలు, పోర్టు సమీప దేవాలయానికి రూ.80 లక్షల నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టామని వివరించారు. రానున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, రాజమహేంద్రవరం అతిథి సత్కారానికి పెట్టింది పేరని గుర్తుచేశారు.

చీకటి ప్రాంతాల్లో లైటింగ్, రోడ్లు, మౌలిక వసతులు మెరుగుపరుస్తూ పుష్కరాల కోసం నగరాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. చివరగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నరేంద్ర మోదీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తోందని, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగి ప్రజలకు మరింత చేరువ కావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అనంతరం స్థానికంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నిమిషకవి ఇంటిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story