Rajahmundry: బలపడదాం.. ఐక్యంగా విజయం సాధిద్దాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
Rajahmundry: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కార్యకర్తలకు భరోసా.
Rajahmundry: బలపడదాం.. ఐక్యంగా విజయం సాధిద్దాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమండ్రి: నగరంలోని హోటల్ జగదీశ్వరిలో కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యతే విజయానికి పునాది అని పేర్కొంటూ.. అందరం కలిసి బలపడదాం.. రాబోయే ఎన్నికల్లో సమష్టి కృషితో విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో ఇబ్బందులు, కేసులు, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ నాయకులు, కార్యకర్తలు చూపిన పోరాట పటిమ కారణంగానే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాలు నాయకుల ఐక్యతకు, కార్యకర్తల శ్రమకు నిదర్శనమన్నారు.
ఆ విజయ స్ఫూర్తిని కొనసాగిస్తూ త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ గుర్తింపు, గౌరవం, బాధ్యతలను ఆశిస్తారని, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తల త్యాగాలు, నాయకుల కష్టాలు తనకు తెలుసని, అర్హత, సామర్థ్యం, సామాజిక సమీకరణాలు, ప్రజాభిప్రాయం ఆధారంగా అవకాశాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
ఏ ఒక్కరి గౌరవం తగ్గకుండా, అన్ని పార్టీల నాయకులతో చర్చించి సమన్వయంతో ముందుకు వెళ్తానన్నారు. సిటీ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలోని 42 డివిజన్లలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, నాయకత్వ బాధ్యతల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.
ప్రజాభిప్రాయం, సామాజిక వర్గాల సమీకరణాలు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, మైనారిటీ నాయకులకు తగిన గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే పలువురికి వివిధ బాధ్యతలు కల్పించామని, మిగిలిన వారికి కూడా తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
నగర అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ.. గత రెండున్నరేళ్లలో వివిధ రూపాల్లో సుమారు 250 మందికి అవకాశాలు కల్పించామని, 14 ఎండోమెంట్ కమిటీల ఏర్పాటు పూర్తి చేశామని వివరించారు. దశాబ్దాలుగా నగరాన్ని పట్టిపీడిస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామని, 2027 జూన్ నాటికి నగరంలో డంపింగ్ యార్డు సమస్యకు ముగింపు పలకాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
అమృత్ 2.0 పథకం ద్వారా సుమారు రూ.300 కోట్లతో తాగునీరు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో నగరంలోని ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చేయడమే తన లక్ష్యమని, రూ.350 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులతో పాటు మరో రూ.140 కోట్ల డ్రైనేజీ పనులను కూడా ప్రాధాన్యత క్రమంలో చేపడతామని వెల్లడించారు. 2029 ఎన్నికల నాటికి ప్రతి వార్డులోనూ అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పార్టీ క్రమశిక్షణ, నాయకత్వంపై మాట్లాడుతూ.. రాజకీయాల్లో సహనం చాలా ముఖ్యమని, అవకాశాలు వెంటనే రాకపోయినా నిరుత్సాహపడకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ కూటమి ఐక్యతకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. ఏ సమస్య ఉన్నా తన కార్యాలయానికి వచ్చి నేరుగా మాట్లాడవచ్చని, అందరి సమస్యలను విని, ఎవరి గౌరవం తగ్గకుండా పరిష్కార మార్గాలు అన్వేషిస్తానని తెలిపారు.
కూటమి ఒక కుటుంబం లాంటిదని, పదవులు, స్థానాల కంటే పార్టీ ఐక్యత, ప్రజల విశ్వాసం ముఖ్యమని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభించేలా, కూటమి మరింత బలోపేతమయ్యేలా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.




