Rajahmundry: రాజమండ్రిలో బిలాల్ మసీదు నిర్మాణ పనులకు శంకుస్థాపన
Rajahmundry: రాజమహేంద్రవరం బిలాల్ మసీదుకు 52 ఏళ్ల తర్వాత పొజిషన్ సర్టిఫికెట్. నిర్మాణానికి భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే వాసు.
Rajahmundry: రాజమండ్రిలో బిలాల్ మసీదు నిర్మాణ పనులకు శంకుస్థాపన
రాజమండ్రి: మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, ప్రతి ఒక్కరి మత విశ్వాసాలను గౌరవిస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగితే రాజమహేంద్రవరం నగరం మత సామరస్యానికి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని బిలాల్ మసీదు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముస్లిం పెద్దలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మసీదు నిర్మాణానికి తన భవాని చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మసీదుకు 52 ఏళ్లుగా లేని పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించామన్నారు. బిలాల్ మసీదుకు సంబంధించిన స్థలాన్ని 1974లో కేటాయించినప్పటికీ దాదాపు 52 సంవత్సరాలుగా పొజిషన్ సర్టిఫికెట్ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను శాసనసభ్యుడిగా, కూటమి నాయకులు, వార్డు ఇన్‌చార్జి నక్కా చిట్టిబాబు, నక్కా దేవి తదితరులు చేసిన కృషితో 52 ఏళ్ల తర్వాత బిలాల్ మసీదుకు పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించగలిగామని గర్వంగా చెప్పారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రశ్నించే వారు, విమర్శించే వారు ఉంటారని, అలాంటి వారందరికీ ఇప్పుడు తమ వద్ద ఉన్న పొజిషన్ సర్టిఫికెట్టే సమాధానమని పేర్కొన్నారు.
ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలిగామన్నారు. నగరం ఎప్పటి నుంచో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. అన్ని మతాల వారు ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసికట్టుగా ప్రయాణించాలన్నదే తన అభిమతమన్నారు. ఇటీవల మార్కండేయ స్వామి ఆలయంలో జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, సంహిత డిగ్రీ కళాశాల సమీపంలో తనకు సోదర సమానుడైన అబ్దుల్లా, ఆయన స్నేహితులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం నగరంలోని మత సామరస్యానికి నిదర్శనమన్నారు.
రంజాన్ మాసం వచ్చిందంటే తమ నాయకులు ముందుగానే ఇఫ్తార్ కార్యక్రమాల గురించి సూచనలు చేస్తుంటారని చెప్పారు. చిన్న మసీదా, పెద్ద మసీదా, తమను అభిమానించే వారున్నారా లేదా అనే తేడా లేకుండా రాజమహేంద్రవరంలోని ప్రతి మసీదును సమానంగా చూస్తూ గత ఆరేడు సంవత్సరాలుగా ఇఫ్తార్ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తాను మర్చిపోలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
తాడితోట మసీదుకు సంబంధించి రఫీక్ రాజా తదితరులకు ఇచ్చిన మాట ప్రకారం భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత నిధులతో రూ.5 లక్షలు వెచ్చించి మసీదు బయట షెడ్డు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా వాటర్‌లైన్ మసీదుతో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ కార్యక్రమాలను సెంటిమెంట్‌గా వాటర్‌లైన్ మసీదు నుంచే ప్రారంభిస్తామని చెప్పారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి వాటర్‌లైన్ మసీదులో రూ.10 లక్షలతో షెడ్డు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. మసీదు లోపల రాజకీయాలకు తావులేకుండా, తన పేరు కూడా పెట్టవద్దని స్పష్టంగా చెప్పి ఆ పని చేయించానన్నారు. సేవా కార్యక్రమానికి ప్రచారం కంటే ప్రజలకు ఉపయోగపడటమే ముఖ్యమని పేర్కొన్నారు. 2వ డివిజన్ నారాయణపురం మసీదులో నమాజ్ చేసుకునే వారికి ఇబ్బందులు ఉన్న విషయాన్ని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ బాషా తదితరులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.
ముఖ్యంగా పైభాగంలో నమాజ్ చేసుకునే వారికి ఇబ్బందులు లేకుండా చేసేందుకు భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.15 లక్షలతో మసీదు పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే 1వ డివిజన్ బత్తినగర్ మసీదుకు కూడా మంచి షెడ్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఈద్గా వద్ద హైమాస్ట్ లైట్లు
నెహ్రూ నగర్లో మైనారిటీ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఈద్గా ప్రాంగణంలో అర్ధరాత్రి వేళల్లో కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ఇటీవల నిర్వహించిన ‘మన వార్డులో–మన ఆదిరెడ్డి’ కార్యక్రమంలో మైనారిటీ కమిటీ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. వారి విజ్ఞప్తికి స్పందించి వారం రోజుల్లోనే ఈద్గా వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించి, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. “ఇదే చేతితో దేవాలయాలు.. ఇదే చేతితో మసీదులు.. ఇదే చేతితో చర్చిలకు సహకారం” అందిస్తున్నామన్నారు.
ప్రతి వ్యక్తి తన మత విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించుకునే వాతావరణం ఉండాలని, అందుకు ప్రజాప్రతినిధిగా తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. బిలాల్ మసీదు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నందున నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయని స్థానిక ముస్లిం సోదరులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. దీనిపై నక్కా చిట్టిబాబు, నక్కా దేవితో మాట్లాడినట్లు తెలిపారు.
మసీదు పక్కనే ఉన్న హిందువులకు సంబంధించిన ఖాళీ స్థలాన్ని తాత్కాలికంగా నమాజ్ కోసం ఉపయోగించుకునేందుకు స్థానికులు సహృదయంతో అంగీకరించారని చెప్పారు. అంతేకాకుండా నక్కా చిట్టిబాబు, నక్కా దేవి తమ సొంత డబ్బులతో ఆ స్థలాన్ని శుభ్రం చేయించి నమాజ్ చేసుకునేందుకు అనువుగా తీర్చిదిద్దారని ఎమ్మెల్యే వాసు అభినందించారు. ఇదే నిజమైన పరస్పర సహకారమని, ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే సమాజం ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి అవసరమైన అన్ని దశల్లో అధికారుల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
“మీరు మా కుటుంబ సభ్యులు”
మైనారిటీ సోదరులు ప్రతి కార్యక్రమంలో తమను కుటుంబ సభ్యులుగా భావించి భాగస్వాములను చేస్తున్నారని, తమ భావన కూడా అదేనని ఎమ్మెల్యే వాసు అన్నారు. “మీరు మా కుటుంబ సభ్యులు... నా కుటుంబంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు దానికి అండగా నిలబడాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా నాపై ఉంది” అని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు.
బిలాల్ మసీదు నిర్మాణానికి తాను మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ సహకరిస్తారని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మైనారిటీల అభివృద్ధి, వారి ప్రార్థనా మందిరాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు కొనసాగుతాయని చెప్పారు.
బిలాల్ మసీదు నిర్మాణానికి రూ.2 లక్షల సహాయం
బిలాల్ మసీదు నిర్మాణం ప్రారంభించాలని గతంలోనే తాను కోరానని, నిర్మాణం మొదలుపెడితే తన వంతు సహకారం అందిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. అందులో భాగంగా భవాని చారిటబుల్ ట్రస్ట్ నుంచి రూ.1,00,000, అబ్దుల్లా తరఫున రూ.50 వేలు, నక్కా దేవి తరఫున రూ.50 వేలు కలిపి మొత్తం రూ.2 లక్షలను మసీదు నిర్మాణానికి సదరు నగదును మసీదు కమిటీ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధిక సంఖ్యలో ముస్లిం, మైనారిటీలు పాల్గొన్నారు.




