Rajahmundry: ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే చేయాలి.. ఆర్డీవో ఆదేశం

Rajahmundry: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కీలక సూచనలు చేశారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 11 Jun 2026 9:50 PM IST
Rajahmundry
X

Rajahmundry: ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే చేయాలి.. ఆర్డీవో ఆదేశం

Rajahmundry: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవల్ అధికారుల (BLOs) పాత్ర అత్యంత కీలకమని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. శివరాముడు పేర్కొన్నారు.

రాజానగరం ఎంపీడీవో కార్యాలయం మరియు కోరుకొండ ఎంపీడీవో కార్యాలయాల్లో బూత్ లెవల్ అధికారులకు నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) శిక్షణ కార్యక్రమాలకు ఆయన హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో శివ రాముడు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించడం, కొత్త ఓటర్ల నమోదుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి వివరాలను సక్రమంగా నమోదు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

ఓటరు జాబితా పరిశుభ్రత, పారదర్శకత, ఖచ్చితత్వం కోసం బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇంటింటి సర్వే సమయంలో ప్రజలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తుల స్వీకరణ, ధృవీకరణ ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

ఓటరు జాబితాలో ప్రతి అర్హ పౌరుడి పేరు నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడుతుందని, అందువల్ల విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఆర్డీవో స్పష్టం చేశారు. శిక్షణలో వివరించిన అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని కోరారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎన్నికల విభాగం అధికారులు, సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) మరియు ఇతర రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నరు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story