Rajahmundry: రివర్‌ఫ్రంట్‌లో మహనీయుల విగ్రహాల తొలగింపు లేదు

Rajahmundry: రాజమండ్రి రివర్‌ఫ్రంట్‌లో విగ్రహాల తొలగింపు ఉండదని, నిర్వాహకుల సంప్రదింపులతో యూనిఫామ్ అలైన్‌మెంట్‌లో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 31 Aug 2026 11:57 PM IST
Rajahmundry
X

Rajahmundry: రివర్‌ఫ్రంట్‌లో మహనీయుల విగ్రహాల తొలగింపు లేదు

రాజమండ్రి: గోదావరి గట్టున నిర్మాణ దశలో ఉన్న రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనుల నేపథ్యంలో అక్కడ ఉన్న వివిధ మహనీయుల విగ్రహాల విషయంలో ఎలాంటి అపోహలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. విగ్రహాల నిర్వాహకులు, సంబంధిత ప్రతినిధులతో నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వారు ఈ రోజు సమీక్ష నిర్వహించారు.

రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి పనులతో ప్రస్తుతం ఉన్న విగ్రహాలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అధికారులు హామీ ఇచ్చారు. ప్రాజెక్టు తుది రూపకల్పనలో భాగంగా విగ్రహాలను తొలగించడం కాదని, అవసరమైన చోట యూనిఫామ్ రీలోకేషన్, సమాన దూరం, ఒకే అలైన్‌మెంట్, సమానమైన ప్లాట్‌ఫామ్ డిజైన్‌తో క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం మాత్రమే ఉద్దేశమని వివరించారు.

రివర్‌ఫ్రంట్‌లోకి ప్రవేశించే వారు, నడిచే ప్రజలు, బయట నుంచి చూసే సందర్శకులు అందరికీ విగ్రహాలు ఒకే తరహా డిజైన్‌లో కనిపించేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని విగ్రహాలు ఒకే లైన్‌లో ఉండగా, మరికొన్ని విభిన్న ప్రదేశాల్లో లేదా ఎత్తుపల్లాల్లో ఉండటంతో మొత్తం రివర్‌ఫ్రంట్ అందం, సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు.

అందువల్ల సిమెట్రికల్ డిజైన్, సమాన విరామాలు, యూనిఫామ్ అలైన్‌మెంట్ ద్వారా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ఆలోచనను నిర్వాహకుల ముందుంచారు. విగ్రహాల రూపం, పేర్లు, గుర్తింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే, కమిషనర్ స్పష్టం చేశారు. ఒక్క పేరు కూడా తప్పిపోకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా ప్రతి విగ్రహానికి సంబంధించిన వివరాలను నిర్వాహకుల సమక్షంలోనే పరిశీలించి, వారి ఆమోదం అనంతరం తుది రూపకల్పనలో పొందుపరుస్తామని తెలిపారు.

మహనీయుల పేర్లు, విగ్రహాల గుర్తింపు విషయంలో ఎలాంటి చిన్న తప్పిదానికీ అవకాశం ఇవ్వబోమని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని విగ్రహాలకు సాధ్యమైనంత వరకు ఒకే తరహా ప్రభుత్వ ప్లాట్‌ఫామ్, స్టోన్ ఫినిషింగ్, ప్లాంటర్ బాక్సులు, పరిసరాల ల్యాండ్‌స్కేపింగ్ ఉండేలా చూస్తామని అధికారులు వివరించారు. అయితే మహనీయుల విగ్రహాల స్వభావాన్ని బట్టి, కూర్చున్న విగ్రహం, నిలబడి ఉన్న విగ్రహం వంటి వాటి వల్ల ఎత్తులో సహజమైన తేడాలు ఉంటాయని, అది విగ్రహాల అసలు రూపాన్ని మార్చడం కాదని తెలిపారు.

ప్లాట్‌ఫామ్‌ల విషయంలో మాత్రం సమానత్వం పాటిస్తామని చెప్పారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధి కోసం ఇప్పటికే రూపొందించిన డిజైన్‌లో విగ్రహాల స్థానాలను పరిగణనలోకి తీసుకున్నామని, గతంలో జరిగిన చర్చల్లోనూ విగ్రహాలను తొలగించకుండా అవసరమైన మేరకు యూనిఫామ్‌గా రీలోకేట్ చేస్తామని చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అధికారులు గుర్తుచేశారు.

ప్రస్తుతం ఉన్న విగ్రహాల స్థానాల్లో అవసరమైన మార్పులు చేయాల్సి వస్తే, సంబంధిత నిర్వాహకులతో సంప్రదించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. విగ్రహాలను తరలించే సందర్భంలో వాటి నిర్మాణానికి, ఫౌండేషన్‌కు ఎలాంటి నష్టం జరగకుండా సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో పనులు చేపడతామని చెప్పారు. కొత్త ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం, ఫౌండేషన్ బలం, వర్షాకాలంలో భద్రత తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గోదావరి గట్టు మొత్తం ఒక సమగ్ర పర్యాటక, ప్రజా వినోద ప్రదేశంగా అందంగా కనిపించాలన్నదే లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలందరికీ స్పష్టంగా కనిపించేలా విగ్రహాలకు సరైన యాక్సెస్, వాకింగ్ ట్రాక్, ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటర్లను సమన్వయం చేస్తామని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. విగ్రహాల నిర్వాహకుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ముందుకు వెళ్తామని చెప్పారు.

అందరి సహకారంతోనే రివర్‌ఫ్రంట్ పనులు మరింత అందంగా, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలమని ఎమ్మెల్యే వాసు అన్నారు. తొలిదశ పనులు పూర్తయ్యే దిశగా ప్రాజెక్టు వేగంగా సాగుతున్న నేపథ్యంలో, విగ్రహాల విషయంలో ముందుగానే అన్ని అంశాలను స్పష్టంగా చర్చించి, అందరి అభిప్రాయాలతో తుది రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

మొత్తంగా విగ్రహాలను తొలగించడం లక్ష్యం కాదని, వాటి గౌరవం, గుర్తింపు, పేర్లు, నిర్మాణ భద్రతకు పూర్తి ప్రాధాన్యతనిస్తూ రివర్‌ఫ్రంట్ అందానికి అనుగుణంగా అవసరమైన చోట క్రమబద్ధీకరణ మాత్రమే చేపడతామని సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహూల్ మీనా స్పష్టత ఇచ్చారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story