Rajahmundry: రాజమండ్రి సుంకర భాస్కరరావు స్కూల్‌లో RRR సెంటర్ ప్రారంభం!
Rajahmundry: రాజమండ్రిలో RRR సెంటర్ ప్రారంభం. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ కీర్తి చేకూరి అవగాహన.
Rajahmundry: రాజమండ్రి సుంకర భాస్కరరావు స్కూల్‌లో RRR సెంటర్ ప్రారంభం!
Rajahmundry: ప్రకాశంనగర్ రౌండ్ పార్కు వద్ద ఉన్న సుంకర భాస్కరరావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్ ఆర్ ఆర్ సెంటర్‌ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ముఖ్యంగా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ ఆర్ ఆర్ అంటే రెడ్యూస్ రీయూస్ రీ సైకిల్ అని, అంటే అవసరం లేని వినియోగాన్ని తగ్గించడం (Reduce), ఉపయోగించిన వస్తువులను సాధ్యమైనంత వరకు తిరిగి వినియోగించడం (Reuse), పునర్వినియోగానికి అనువైన వ్యర్థాలను రీసైకిల్ చేయడం (Recycle) అని వివరించారు.
ఈ మూడు విధానాలను రోజువారీ జీవితంలో పాటించడం ద్వారా చెత్త పరిమాణాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. అనంతరం ఎమ్మెల్యే వాసు, కలెక్టర్ కీర్తి చేకూరి, కమిషనర్ రాహుల్ మీనా విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆర్ ఆర్ ఆర్ విధానం గురించి వారికి ఉన్న అవగాహనను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, పునర్వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి, రీసైక్లింగ్ ఎందుకు అవసరం వంటి అంశాలపై విద్యార్థులతో చర్చించారు.
విద్యార్థులు కూడా ఆర్ ఆర్ ఆర్ విధానంపై తమకు ఉన్న అవగాహనను వివరించారు. పాఠశాల స్థాయిలోనే పర్యావరణ హితమైన అలవాట్లను పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.




