Rajahmundry: గోదావరి కాలుష్య నివారణకు రూ.2 కోట్లతో పైపులైన్ పనులు
Rajahmundry: రాజమండ్రిలో గోదావరి కాలుష్య నివారణకు రూ.2 కోట్లతో పైపులైన్ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ నెలాఖరులోగా కొత్త పెన్షన్లు.
Rajahmundry: గోదావరి కాలుష్య నివారణకు రూ.2 కోట్లతో పైపులైన్ పనులు
రాజమండ్రి: గోదావరి నదీ జలాలను కాలుష్యం నుంచి కాపాడటానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 34వ డివిజన్‌లో వాసవి శ్రీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోని నల్లా ఛానెల్ పంప్‌హౌస్ నుంచి పుష్కర ఘాట్ వరకు రూ.2 కోట్ల వ్యయంతో 600 ఎంఎండీఐ పైపులైన్ ఏర్పాటు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లా ఛానెల్ నుంచి గోదావరిలోకి మురుగునీరు కలిసే పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పైపులైన్‌ను సుమారు 5 అడుగుల లోతులో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పైపులైన్ ద్వారా మురుగునీటిని గోదావరి గట్టు మీద ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానం చేసి, త్రీటౌన్, జిల్లా కోర్టు, పుష్కర ఘాట్ మీదుగా హెడ్‌వాటర్ వర్క్స్ వద్ద ఉన్న మెయిన్ అండర్‌గ్రౌండ్ డ్రైన్‌కు తరలిస్తామని చెప్పారు.
గోదావరి గట్టు వెంట ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలంలో మురుగునీరు, వర్షపు నీరు గోదావరిలో కలవకుండా ప్రత్యామ్నాయ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత డ్రైనేజీ వ్యవస్థను గుర్తించి, దాని అలైన్‌మెంట్‌ను పరిశీలించి, పూడిక తొలగించేందుకు మూడు నెలలపాటు కృషి చేశామని తెలిపారు.
ఇక నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.79 కోట్లతో ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ త్వరలో రానుందని వెల్లడించారు. అలాగే క్వారీ ప్రాంతంలోని కంపోస్ట్ యార్డును ఏడెనిమిది నెలల్లో తొలగించి, నగరంలోని వ్యర్థాలను పెద్దాపురంలో నిర్మిస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నగరానికి దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు ఒక్కొక్కటిగా శాశ్వత పరిష్కారాలు చూపించడం ప్రజాప్రతినిధిగా తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. కొత్త పెన్షన్లపై ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ సచివాలయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, ఈ నెలాఖరులోగా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.




