Rajahmundry: అన్నా క్యాంటీన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం
Rajahmundry: రాజమండ్రిలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ పాల్గొన్నారు.
Rajahmundry: అన్నా క్యాంటీన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం
రాజమండ్రి: అన్న క్యాంటీన్ల విజయవంతమైన నిర్వహణ, పర్యవేక్షణ, సేవల నాణ్యతను పెంచడంలో ప్రత్యేక ఓరియంటేషన్ మరియు శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ అన్నారు. గురువారం గోకవరం బస్టాండ్ సమీపంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ నందు అడ్వైజరీ కమిటీ సమక్షంలో నిర్వాహకులు మరియు సిబ్బందికి ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన ఆహార సేవలను అందించడం, ఉన్నత ప్రమాణాలతో పరిశుభ్రతను పాటించడంతో పాటు లబ్ధిదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించేలా చూడటం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దీని ద్వారా సిబ్బందికి కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిగత పరిశుభ్రత, క్యాంటీన్ పరిసరాలలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణపై తర్ఫీదును ఇవ్వడం జరిగిందన్నారు.
అలాగే నిరుపేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్న ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా ప్రతి అన్నా క్యాంటీన్ పరిధిలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి.. విస్తృతమైన బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. వారానికి రెండుసార్లు ఈ కమిటీ సభ్యులు తనిఖీలు నిర్వహించి.. క్యాంటీన్లలో సర్వీస్ క్వాలిటీ, ఆహారం రుచి, పదార్థాల నాణ్యత, వంటశాల, పరిసరాల పరిశుభ్రతను నిశీతంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా లబ్ధిదారులు నుంచి ఫీడ్బ్యాక్ సేకరించడం., సేవల్లో లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరక్టర్ కనకరాజు, రెవిన్యూ అధికారులు సీహెచ్ శ్రీనివాసరావు, లలిత, మెప్మా డిస్ట్రిక్ రీసోర్స్ పర్సన్, ట్రైనర్ పొన్నల దినకర్, సీఎంఎం రామలక్ష్మి, అడ్వైజరీ కమిటీ సభ్యులు పి.సరస్వతి, ఎన్జీవో సభ్యులు, క్యాంటీన్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.




