Rajamahendravaram: ప్రజావసరాలకే మొదటి ప్రాధాన్యం ఎమ్మెల్యే ఆదిరెడ్డి

Rajamahendravaram: 45వ డివిజన్‌లో రూ. 52.30 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. కమ్యూనిటీ హాల్, రోడ్ల సమస్యలు తీరుస్తామన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 23 July 2026 3:27 PM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: ప్రజావసరాలకే మొదటి ప్రాధాన్యం ఎమ్మెల్యే ఆదిరెడ్డి

రాజమండ్రి: ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే తమ తొలి ప్రాధాన్యతని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేశారు. రూ. 52.30 లక్షలతో 45వ డివిజన్ పరిధిలోని ఆర్ అండ్ బి వాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ కు రక్షణ గోడ, షెడ్ నిర్మాణం, రాజీవ్ నగర్ డిపి స్టేషన్ ఎదురుగా ఇందిరానగర్‌కు అనుసంధానంగా వెట్ మిక్స్ లేయర్ రహదారి నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంఖుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ 45వ డివిజన్లోని ఆర్ అండ్ బి కంపోస్ట్ యార్డ్ వద్ద దశాబ్దాలుగా పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలను ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగిస్తున్నామన్నారు.

కంపోస్ట్ యార్డ్, ఏపీ పేపర్ మిల్లు వంటి పరిశ్రమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ అండ్ బి కాలనీ, రత్నంపేట, శ్రీలంక, ఇందిరానగర్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామన్నారు.

గతంలో ఎమ్మెల్సీగా ఉన్న తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చొరవతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆర్ అండ్ బి శాఖ నుంచి కార్పొరేషన్‌కు స్థలం బదిలీ అయ్యిందని గుర్తు చేశారు.

అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు ఐదేళ్లపాటు ఆ భవనం నిర్లక్ష్యానికి గురై పూర్తిగా దెబ్బతిందని, కోర్టు ఆదేశాల తర్వాత పరిశీలించినప్పుడు ఫాల్స్ సీలింగ్‌తో సహా లోపలి సామగ్రి మొత్తం ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు.

ఏపీ పేపర్ మిల్స్ సహకారంతో కేవలం రూ.35 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్‌ను పూర్తిగా పునరుద్ధరించామని చెప్పారు. గతంలో సుమారు కోటి రూపాయలతో చేపట్టిన పనులను తాము రూ.35 లక్షలకే పూర్తి చేశామని తెలిపారు.

ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్‌కు రక్షణ గోడ, భోజనాల వంట కోసం షెడ్, సామగ్రి భద్రపరిచేందుకు రెండు గదులు, 2,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ.25 లక్షలతో పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు.

రాజీవ్ నగర్–ఇందిరానగర్ ప్రాంతాలను అనుసంధానించే రహదారి ప్రతి వర్షాకాలంలో నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.

స్థానిక ఇన్‌చార్జి కొయ్యల రమణ ప్రజల సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో అధికారుల సూచనల మేరకు సుమారు రూ.28 లక్షలతో వెట్ మిక్స్ లేయర్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.

టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే మార్కింగ్ పూర్తి చేసి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ రహదారి పూర్తయితే ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ఇందిరానగర్‌కు రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదన్నారు.

కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు ఏపీ పేపర్ మిల్స్ అందించిన రూ.35 లక్షలు, ప్రస్తుతం కార్పొరేషన్ నిధులతో చేపడుతున్న రూ.30 లక్షల పనులు కలిపి సుమారు రూ.65 లక్షల వ్యయంతో అత్యాధునిక కమ్యూనిటీ హాల్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.

45వ వార్డులో ఇప్పటికే రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో రూ.30 లక్షల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈరోజు రూ.52.30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో మొత్తం అభివృద్ధి వ్యయం రూ.2.20 కోట్లకు చేరిందన్నారు.

అదనంగా రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మరో రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రతిపాదించామని, అవి కూడా త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు.

కంపోస్ట్ యార్డ్, పేపర్ మిల్లు ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బలహీన, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ఈ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

బలహీన వర్గాల ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, స్థానిక ప్రజలు, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story