Rajolu: రాజోలులో ప్రగతి పరుగు.. రెండేళ్లలో రూ.600 కోట్ల అభివృద్ధి!

Rajolu: కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రెండేళ్లలో రూ.600 కోట్ల అభివృద్ధి పనులు.

PRABHU, RAZOLE
Published on: 14 Jun 2026 8:47 AM IST
Rajolu
X

Rajolu: రాజోలులో ప్రగతి పరుగు.. రెండేళ్లలో రూ.600 కోట్ల అభివృద్ధి!

డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా: ఒక ప్రజా ప్రతినిధి సంకల్పం, ప్రభుత్వ సహకారం, ప్రజల ఆకాంక్షలు కలిసివస్తే ఒక ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో రాజోలు నియోజకవర్గం నేడు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. గత రెండేళ్ల కాలంలో సుమారు రూ.600 కోట్ల విలువైన అభివృద్ధి పనులతో రాజోలు నియోజకవర్గం కొత్త రూపును సంతరించుకుంటోంది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, ప్రజా సంక్షేమం మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాజోలు అభివృద్ధి ప్రస్థానం ముందుకు సాగుతోంది.

గ్రామీణ రోడ్లతో పెరిగిన అనుసంధానం :

అభివృద్ధికి రహదారులే పునాది అన్న భావనతో నియోజకవర్గంలో రూ.100 కోట్లతో విస్తృత స్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. రూ.30 కోట్ల వ్యయంతో సుమారు 500 గ్రామీణ రోడ్ల నిర్మాణం పూర్తికాగా, మరో రూ.5 కోట్లతో ఆరు ప్రాజెక్టు రోడ్లు నిర్మించారు. అదనంగా 25 నుంచి 30 రోడ్లు టెండర్ దశలో ఉన్నాయి.

ఎన్నో ఏళ్లుగా ప్రజల కలగా ఉన్న గుడిమెళ్లంక – చింతలపల్లి కలింగుల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది.

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు :

రాజోలు నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలవుతున్న ప్రాజెక్టులలో ‘అమరజీవి జలధార’ ఒకటి. రూ.250 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతిరోజూ శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 50 నీటి ట్యాంకుల నిర్మాణం, ట్రంక్ లైన్, డిస్ట్రిబ్యూషన్ లైన్ పనులు శరవేగంగా సాగుతుండగా, మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రజలు మినరల్ వాటర్ కోసం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అంతర్వేది రక్షిత మంచినీటి పథకాన్ని రూ.17.33 కోట్లతో ప్రారంభించగా, గుడిమెల్లంక వాటర్ స్కీమ్‌లో రూ.5 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో అదనపు ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ నిర్మాణం కొనసాగుతోంది.

విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు :

నియోజకవర్గంలో రూ.100 కోట్ల వ్యయంతో నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశారు. గుడిమూల లో 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టగా, గుడిమెల్లంక మరియు శంకరగుప్తంలో కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు కృషి కొనసాగుతోంది. శంకరగుప్తంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రతిపాదన దశలో ఉంది. ఇప్పటివరకు 250 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయగా, మరో 200 ట్రాన్స్‌ఫార్మర్లకు ప్రతిపాదనలు పంపారు. రూ.22 కోట్లతో 48 కిలోమీటర్ల మేర 33 కేవీ ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 100 కిలోమీటర్ల మేర 11 కేవీ ఇన్సులేటెడ్ కండక్టర్ లైన్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

తీరప్రాంత ప్రజలకు ఉపశమనం :

ఏళ్ల తరబడి తీర ప్రాంత ప్రజలను వేధిస్తున్న శంకరగుప్తం డ్రెయిన్ సమస్య పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. రూ.20.77 కోట్లతో 8 కిలోమీటర్ల పూడికతీత, 29 కిలోమీటర్ల మేర గట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

అదనంగా రూ.3.50 కోట్లతో కాలువలు, డ్రైనేజీల అభివృద్ధి మరియు పూడికతీత పనులు చేపట్టడం ద్వారా వ్యవసాయం, గ్రామీణ జీవన విధానానికి మేలు చేకూరనుంది.

ఆరోగ్య సేవలకు కొత్త ఊపు :

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గత రెండేళ్లలో 1,025 మంది లబ్ధిదారులకు రూ.8 కోట్ల ఆర్థిక సహాయం అందించారు.

అలాగే రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా కిడ్నీ రోగులకు స్థానికంగానే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి.

నీటి పారుదల, వరద నియంత్రణకు ప్రాధాన్యం :

కడలి అవుట్‌ఫాల్ స్లూయిస్ ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, అంతర్వేది రాళ్లకాలువ అవుట్‌ఫాల్ స్లూయిస్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

అంతర్వేదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం :

ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన అంతర్వేది క్షేత్రాన్ని రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అభివృద్ధి కొనసాగుతోంది...

గత రెండేళ్లలో చేపట్టిన పనులు రాజోలు నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఒక బలమైన పునాది వేశాయి. ఇవి కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలులోకి రానున్నాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఆకాంక్షలను కార్యరూపంలోకి తీసుకువస్తూ, అభివృద్ధినే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాజోలు నియోజకవర్గం నేడు రాష్ట్రంలో అభివృద్ధికి ఒక ఆదర్శంగా నిలుస్తోంది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story