Rajahmundry: కేంద్ర విధానాలపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి పోరు అవసరం: ఆర్‌పీసీ!

Rajahmundry: కేంద్ర విధానాలను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకు మేధావులు, ఉద్యమకారులు ఏకం కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 4 Oct 2026 11:25 PM IST
Rajahmundry
X

Rajahmundry: కేంద్ర విధానాలపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి పోరు అవసరం: ఆర్‌పీసీ!

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణతోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వ రాజకీయ విధానాలను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవచ్చని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. ప్రత్యామ్నాయ ప్రజా కూటమి ఏర్పాటుకు రెండు రాష్ట్రాల్లోని మేధావులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆర్‌పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సహజ వనరులు, ఖనిజ సంపద, వ్యాపార అవకాశాలను ఆయా రాష్ట్రాల అభివృద్ధికే వినియోగించేలా రాజకీయ ప్రక్షాళన అవసరమన్నారు.

తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాజకీయాలపై, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై మేడా శ్రీనివాస్ విమర్శలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలు, రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వంతో తమ రాజకీయ సంబంధాల కారణంగా రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని ఆయన విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల భవిష్యత్ కోసం మేధావులు, ఉద్యమకారులు ఏకమై ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు పెంచే రాజకీయాలకు బదులుగా పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఎన్నికల వ్యవస్థ, ఈవీఎంలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత వ్యవస్థలపై ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగేలా పారదర్శకత ఉండాలని కోరారు.

తెలంగాణలో ఆదాయ వనరులను పెంచడంతో పాటు అప్పుల భారాన్ని నియంత్రించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ అందుబాటులో ఉన్న ఆదాయ వనరులను సమర్థవంతంగా వినియోగించి అప్పులపై ఆధారపడకుండా దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపద, వ్యాపార అవకాశాలు ఉన్నాయని, వాటిని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలు అమలు కావాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును కాపాడాలని, ప్రజా ఉద్యమాలపై కేసులు, నిర్బంధాలు వంటి చర్యలకు బదులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించాలని మేడా శ్రీనివాస్ కోరారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ భవిష్యత్, తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మేధావులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు కలిసి ప్రజా ప్రయోజనాల కోసం మహా కూటమిగా ఏర్పడి కార్యాచరణ రూపొందించాలని కోరారు.ఈ సమావేశంలో

ఆర్‌పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు, ఆర్‌పీసీ సెక్యులర్స్ సిమ్మా దుర్గారావు, డి.వి. రమణమూర్తి, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్‌కుమార్, కారుమూరి యుగంధర్, దుడ్డే త్రినాద్, వాడపల్లి జ్యోతిష్, జవ్వాది మోహన్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, చల్లా సాంబశివరావు, చల్లా శివ దుర్గారావు, పాండ్రంకి ఈశ్వరరావు, మట్టపర్తి తులసి, ఎం.కె. ఆలీ, ఎస్.కె. సమీర్, కె. ఆంజనేయులు, కె. దుర్గా నవ్యశ్రీ, మాసా అప్పాయమ్మ, త్రిపురాల పాండవులు, దబ్బా కుమారి, అత్తిలి శ్రీనివాసరావు, మాసా సుభద్ర, మాసా అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY