Ravulapalem: రావులపాలెంలో రూ.2.83 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
Ravulapalem: రావులపాలెంలో రూ.2.83 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Ravulapalem: రావులపాలెంలో రూ.2.83 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
రావులపాలెం: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. పల్లె పండుగ 3.0లో భాగంగా రావులపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం,శంకుస్థాపనల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పాలన వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తవుతాయని ఎన్నికల ముందు చెప్పడం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నారని తెలిపారు.
సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, గత ఐదేళ్ల వైసిపి పాలనలో అడుగంటిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకుని వస్తూ... గ్రామాల్లో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు రావులపాలెంలో రూ.2.83 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపట్టినట్లు తెలిపారు.
ఎక్కడికి వెళ్ళినా కూటమి నాయకులు చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను చూసి ఆనందిస్తున్నారన్నారు. ఇంకా మిగిలిపోయిన వారి సమస్యలను తెలియజేస్తున్నారని, వీటిని కూడా చేయండని అడుగుతున్నారని, తప్పకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ అభివృద్ధి ఈ విధంగానే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఎన్డీఏ కూటమి పదికాలాలపాటు అధికారంలో ఉండాలని, ప్రజల సంక్షేమ అభివృద్ధి రెండింటిని అందుకోవాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం, రాష్ట్రం కోసం పాటుపడుతున్నారన్నారు.
ఈ అభివృద్ధి ఈ విధంగానే కొనసాగాలి అంటే కూటమికి అండగా నిలవాలని ఆయన అన్నారు. ఐ లవ్ యు రావులపాలెం, కోనసీమ ముఖ ద్వారాన్ని బ్యూటిఫికేషన్ చేయడం జరిగిందన్నారు. కళా వెంకట్రావు విగ్రహం, వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ముఖద్వారం వీటన్నిటిని తీర్చిదిద్ది రావులపాలెం సెంటర్ ఎంతో అందంగా ఉండేలా తయారుచేయడం జరుగుతుందన్నారు. రావులపాలెం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.




