Razole: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు

Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి; గ్రంథాలయానికి జర్నల్ ర్యాక్, 50 కుర్చీలను దాతలు విరాళంగా ఇచ్చారు.

PRABHU, RAZOLE
Published on: 20 Nov 2026 4:03 PM IST
Razole
X

Razole: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు

రాజోలు: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తి, సృజనాత్మకత, విజ్ఞానాభివృద్ధి, నిరంతర అభ్యసనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వ్యాసరచన పోటీలు, పుస్తక సమీక్షలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సాయిబాబు వారోత్సవాలను ప్రారంభించి మాట్లాడుతూ, విద్యార్థుల విజ్ఞాన సముపార్జన, మేధో వికాసంలో గ్రంథాలయాల పాత్ర కీలకమని, పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు, పత్రికలు చదివే అలవాటును జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా కళాశాల పూర్వ గ్రంథపాలకులు శ్రీ నర్ర సీతారామరావు (1971–1976) గ్రంథాలయానికి జర్నల్ ర్యాక్‌ను విరాళంగా అందజేశారు. దీనివల్ల జర్నల్స్‌ను క్రమబద్ధంగా అమర్చడంతో పాటు విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు వీలవుతుంది. అలాగే ముగింపు రోజున ఇరుసుమండ గ్రామానికి చెందిన శ్రీ ఉసిరిక వీరభద్రరావు విద్యార్థుల సౌకర్యార్థం 50 కుర్చీలను విరాళంగా అందజేశారు. వీరి ఉదార సహకారానికి ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో గ్రంథాలయ మరియు సమాచార శాస్త్ర విభాగం, కంప్యూటర్ సైన్స్ విభాగం సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ (APLA), విజయవాడ సహకారంతో “READ TO LEARN – LEARN TO LEAD (చదివి నేర్చుకోండి – నేర్చుకుని నాయకత్వం వహించండి)” అనే అంశంపై ఆన్‌లైన్ అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. APLA కార్యదర్శి డా. రావి శారద ముఖ్య వక్తగా పాల్గొని, పఠనం ద్వారా జ్ఞానాభివృద్ధి, విమర్శనాత్మక ఆలోచన, నిరంతర అభ్యసనం, నాయకత్వ లక్షణాల పెంపుదల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో 66 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా, 124 మంది ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డా. పి. సాయిబాబు నిర్వాహకులను అభినందించి, విద్యార్థులు, అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి శ్రీ జి. వరప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.

పఠన సంస్కృతిని పెంపొందించడం, గ్రంథాలయ సౌకర్యాలను అభివృద్ధి చేయడం, విద్యార్థుల విజ్ఞానాభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE