Sakhinetipalli: మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత సీఐ సురేష్ బాబు
Sakhinetipalli: కోనసీమ జిల్లా మోరి పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రతపై అవగాహన సదస్సు. ఆపద వస్తే 112కు కాల్ చేయాలని రాజోలు సీఐ సురేష్ బాబు పిలుపు.
Sakhinetipalli: మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత సీఐ సురేష్ బాబు
సఖినేటిపల్లి: నేటి సమాజంలో మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మాదక ద్రవ్యాల వ్యసనం యువత జీవితాలను అంధకారంలోకి నెడుతోందని రాజోలు సీఐ వి. సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.
డాక్టర్.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం మోరి గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సై కె. దుర్గా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలు– చిన్నారుల భద్రత, రక్షణపై అవగాహన సదస్సులో రాజోలు సీఐ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు విలువైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్షణిక ఆనందం కోసం మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువత తమ బంగారు భవిష్యత్తును స్వయంగా నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను నమ్మి వ్యక్తిగత వివరాలు పంచుకోవడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
చిన్నారుల రక్షణలో తల్లిదండ్రులే తొలి సంరక్షకులని పేర్కొన్న ఆయన, పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని సూచించారు. బాలల హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అన్నారు.
మహిళల భద్రత కోసం పోలీసు శాఖ అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయ వ్యవస్థ గురించి వివరించిన సీఐ, ఏ ఆపద వచ్చినా వెంటనే 112కు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించినప్పుడే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఈ అవగాహన సదస్సులో స్థానిక ప్రజలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




