Razole: రాజోలులో కిడ్నీ రోగికి రూ.55 వేల ఆర్థిక సహాయం
Razole: రాజోలు మండలం తాటిపాకలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లీలాదేవికి గల్ఫ్ సేవా సమితి, ఏ వన్ సేవా సమితి సభ్యులు రూ.55 వేల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటారు.
Razole: రాజోలులో కిడ్నీ రోగికి రూ.55 వేల ఆర్థిక సహాయం
రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన చిట్టూరి లీలాదేవి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గల్ఫ్ సేవా సమితి–శెట్టిబలిజ కమ్యూనిటీ, మస్కట్ సభ్యులు మానవతా దృక్పథంతో రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.
అలాగే ఏ వన్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ రూ.5 వేల సహాయం అందించారు. దీంతో లీలాదేవి కుటుంబానికి మొత్తం రూ.55 వేల ఆర్థిక సహాయం అందింది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జీవనోపాధి కోసం కుటుంబాలకు దూరంగా విదేశాల్లో ఉంటున్న యువకులు వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి, ఆపదలో ఉన్న కుటుంబాలను గుర్తించి ఆర్థికంగా అండగా నిలవడం అభినందనీయమన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ గల్ఫ్ సేవా సమితి సభ్యులు చూపిస్తున్న సేవా స్ఫూర్తి ఆదర్శనీయమని కొనియాడారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి కుటుంబాలకు కొంత ఊరట కల్పిస్తున్నారని, ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. గల్ఫ్ దేశాల్లో ఉంటూ స్వదేశంలోని ఆపదలో ఉన్నవారిని గుర్తించి అండగా నిలుస్తున్న సేవా సమితి సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏ వన్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్, దొంగ శ్రీనివాస్, చిట్టూరి శ్రీనివాస్, పితాని సూరిబాబు, శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గల్ఫ్ సేవా సమితి సభ్యులు పిల్లి ఠాగూర్‌బాబు, బుల్లెట్ బాబి, పిల్లి శ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




