Razole: రాజోలులో వైన్‌షాప్‌ వద్దంటూ ప్రజల ఆందోళన.. రహదారిపై బైఠాయింపు

Razole: రాజోలులో ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వైన్‌షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహిళలు, స్థానికులు జోరువానలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.

PRABHU, RAZOLE
Published on: 17 Oct 2026 5:31 PM IST
Razole
X

Razole: రాజోలులో వైన్‌షాప్‌ వద్దంటూ ప్రజల ఆందోళన.. రహదారిపై బైఠాయింపు

రాజోలు: ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాల సమీపంలో వైన్‌షాప్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజోలులో మహిళలు, స్థానికులు ఆందోళనకు దిగారు. జోరువానను సైతం లెక్కచేయకుండా దుకాణం ఎదుట జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఐసీడీఎస్, హెడ్ పోస్టాఫీసు, సీఐ, ఎస్సై కార్యాలయాలు, ఎమ్మార్వో కార్యాలయం, సబ్‌ ట్రెజరీ, అగ్రికల్చర్, ఫైర్ కార్యాలయాలతో పాటు ప్రైవేటు ఆసుపత్రి, నివాస గృహాలు ఉన్న ప్రాంతంలో వైన్‌షాప్ ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ అనధికార బస్ స్టాప్ కూడా ఉండటంతో ఈ ప్రాంతానికి నిత్యం మహిళలు, చిన్నారులు, రోగులు, సామాన్య ప్రజలు వస్తుంటారని, మద్యం దుకాణం వల్ల వారి భద్రతకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వైన్‌షాప్‌ను ఈ ప్రాంతం నుంచి తొలగించి, జనసంచారం తక్కువగా ఉండే మరో అనువైన ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా దుకాణాన్ని కొనసాగించవద్దని, సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని అనుమతులు, నిబంధనలను పరిశీలించాలని కోరారు. తమ డిమాండ్‌పై స్పష్టమైన నిర్ణయం ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని నిరసనకారులు తెలిపారు.అయితే రహదారి పై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా క్లియర్ చేశారు.

వర్షంలోనూ వెనక్కి తగ్గకుండా సాగిన ఈ నిరసనతో రాజోలులో వైన్‌షాప్‌ వివాదం చర్చనీయాంశంగా మారింది. స్థానికుల డిమాండ్‌పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE